తెలుగుదేశం పార్టీ ముద్దు బిడ్డడు లోకేషుడు అరివీర భయంకరమైన ఛాలెంజ్ ఒకటి చేశారు. అదేమిటంటే.. ప్రత్యక్ష పోరాటానికి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు తనయుడు పిలుపును ఇచ్చారు! ప్రత్యక్ష పోరాటం అంటే.. బహుశా లోకేష్ దృష్టిలో ముఖాముఖి తలపడి కొట్టుకోవడం లాగుంది! ఇలాంటి మాటలతో లోకేష్ టీ కొట్టు ఛాలెంజ్ లు విసురుకునే రేంజ్ తనదని చాటుకుంటూ ఉన్నాడు.
అయితే ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలను పూర్తి చేసుకున్న లోకేష్ ప్రత్యక్ష పోరాటం అంటే అర్థం తెలుసుకోవాల్సి అవసరం కనిపిస్తూ ఉంది! ప్రత్యక్ష పోరాటం అంటే లోకేష్ అనుకుంటున్నది కాదు. ప్రజాస్వామ్యంలో పార్టీల నేతలు ప్రత్యక్ష పోరాటంలో సత్తా చూపడం అంటే ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం వంటివి అనమాట!
బహుశా లోకేష్ కు వీటిల్లో అనుభవం తక్కువ, లేదు కాబట్టి.. ప్రత్యక్ష పోరాటం అంటే ఇంకా ఏదో అనుకుంటున్నట్టుగా ఉన్నాడు. తండ్రి సీఎం సీట్లో ఉన్నాడు కాబట్టి, కేబినెట్లో మంత్రి అయిపోవడం, ఆపై ఎమ్మెల్సీగా నామినేట్ కావడం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే! తండ్రి సీఎం కాబట్టి.. సెక్రటేరియట్ లో మంత్రులందరి వద్దా తన అసిసెంట్లను నియమించి, వారిపై నిఘాపెట్టడం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే!
తండ్రి పార్టీ అధ్యక్ష హోదాలో ఉన్నాడు కాబట్టి..తనకు కావాల్సిన పదవులను ఎలా బడితే అలా తీసుకోవడం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే! టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అనే తన హోదాకు.. వారసత్వం తప్ప మరే అర్హత లేకపోవడం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే!
ఏది మాట్లాడినా, ఏది బడితే అది మాట్లాడినా, సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఎవరికి వారు ఉరేసుకున్నట్టే అని ప్రకటించినా, ఆ పార్టీ ముఖ్య నేతగా, కాబోయే టీడీపీ అధిపతిగా ప్రచారం పొందడం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే!
కులపిచ్చి, మత పిచ్చి, బంధుప్రీతి, ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పిన తర్వాత కూడా.. ఆ పార్టీ తరఫున కాబోయే ముఖ్యమంత్రి అనిపించుకోవడం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే! మంగళగిరి అని మందళగిరి అని పలికినా.. స్పష్టమైన వాచకం లేకపోయినా… యువనేతగా కీర్తనలు పొందడం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే! ట్వీట్లతో తప్ప.. ప్రజల మధ్యకు వెళ్లి పది రోజులు గడపలేకపోడం కాదు ప్రత్యక్ష పోరాటం అంటే!
ఇవేవీ తెలియనట్టుగా గడిపేసే లోకేష్.. ప్రత్యక్ష పోరాటానికి పిలుపును ఇవ్వడానికి మించిన కామెడీ మరోటి లేకపోవచ్చు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి లోకేష్ ప్రత్యక్ష పోరాటంలో దిగారు ఇప్పటి వరకూ. అది మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం. అప్పుడు జగన్ నియమించిన అభ్యర్థితో లోకేష్ ప్రత్యక్ష పోరాటంలో తలపడ్డారు.
అప్పుడు ఫలితం ఎలా వచ్చిందో గుర్తుంచుకోవాలి. దాన్ని గుర్తుంచుకుని.. ప్రత్యక్ష పోరాటం అనే మాటను లోకేష్ పలకాలి! అసలు ప్రత్యక్ష పోరాటం నుంచి గాక.. అంతా పరోక్ష, వారసత్వ తప్ప మరో అర్హత లేని లోకేష్ ప్రత్యక్ష పోరాటం అనడం ఏమిటో.. తనకు ఆ మాటెత్తే అర్హత ఉందా అనేది లోకేష్ ఆలోచించుకోవాల్సిన అంశం. అలా ఆలోచించుకునే వ్యక్తే అయితే ఇలా మాట్లాడడేమో!