పగిలిన అద్దాలకే రాష్ట్రపతి పాలన పెట్టేస్తారా బాబూ!

ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేని రాష్ట్రాల్లో ఏదో ఒక నెపంతో రాష్ట్రపతి పాలన పెట్టి ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ నిలబెట్టడం ఆ పార్టీకి అలవాటు. మరి ఏపీలో ఆ పరిస్థితి ఉందా..?…

ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేని రాష్ట్రాల్లో ఏదో ఒక నెపంతో రాష్ట్రపతి పాలన పెట్టి ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ నిలబెట్టడం ఆ పార్టీకి అలవాటు. మరి ఏపీలో ఆ పరిస్థితి ఉందా..? అసలు కేంద్రానికి అంత సీన్ ఉందా..? మరి చంద్రబాబు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారు, లేఖలు రాస్తున్నారు. 

గతంలో ఆర్థిక అత్యయిక పరిస్థితి ఉందని ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతారని తెగ ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు శాంతి భద్రతల సమస్య ఉందని, ఏపీలో రాష్ట్రపతి పాలన తప్పదని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.

రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టే అధికారం కేంద్రానికి ఉంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం, గందరగోళ వాతావరణాన్ని నియంత్రించే పరిస్థితి లేనప్పుడు గవర్నర్ సూచనల మేరకు రాష్ట్రపతిపాలన విధించొచ్చు. లేదా ఎమ్మెల్యేల తిరుగుబాటు, రాజకీయ సంక్షోభం ఏర్పడితే రాష్ట్రపతిపాలన పెట్టి తిరిగి ఎన్నికలకు సిఫార్సు చేయొచ్చు. కానీ ఏపీలో ఇలాంటి పరిస్థితులు లేవు.

151మంది ఎమ్మెల్యేలతో వైసీపీ బలంగా ఉంది. ఇంకొంతమంది అదనంగా కూడా ఉన్నారు. ఇక శాంతి భద్రతల విషయానికొస్తే.. మంగళగిరిలో పగిలిన అద్దాలను చూపించి టీడీపీ హడావిడి చేస్తోంది కానీ ఎక్కడా సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది లేదు. అసలు ఏపీ బంద్ అంటూ టీడీపీ ప్రకటించిన రోజే.. ప్రజా జీవనం సాఫీగా సాగింది. మరి ఇంకెందుకు రాష్ట్రపతి పాలన వస్తుంది, ఎలా వస్తుంది.?

ఏ రాష్ట్రంలో అయినా ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. కానీ ఏపీలో ఇబ్బంది ప్రజలకు కాదు, కేవలం టీడీపీ నేతలకు మాత్రమే. టీడీపీ నేతలే వరుస ఓటములతో కుంగిపోయారు, పార్టీ పరిస్థితి మెరుగుపడదు, వచ్చే ఎన్నికల్లో మరింత పతనం ఖాయం అనే నిజాన్ని జీర్ణించుకోలేక అవస్థలు పడుతున్నారు. 

నిన్న ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టు.. వైసీపీపై ప్రజల అభిమానాన్ని జీర్ణించుకోలేక టీడీపీ ఇలా అవస్థలు పడుతోంది. ఏపీలో ఏదో జరిగిపోతోందనే కలరింగ్ ఇచ్చి కేంద్రానికి లేఖలు రాసి రాక్షసానందాన్ని పొందుతోంది.

చంద్రబాబు లేఖల్ని పట్టించుకునేంత సీన్ హస్తినలో లేదు, అసలు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టే అవసరమే లేదు. రాగా పోగా బాబు లేఖలే రాజ్యాంగం అంటూ హెడ్ లైన్స్ పెట్టుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించే పచ్చపాత మీడియాకు మాత్రమే ఈ రాష్ట్రపతి పాలన అనేది ఓ ముఖ్యమైన అంశం.