భారత్ బయోటెక్ తయారు చేసిన కో వ్యాగ్జిన్ విషయంలో రాజకీయ నేతల ప్రకటనలు కొత్త గందరగోళానికి తెరతీస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ను వాడుకోవడానికి డీసీజీఐ షరతులతో కూడిన అనుమతిని ఇవ్వడంపై దుమారం రేగుతూ ఉంది.
పూర్తి స్థాయి పరీక్షలు, ఫలితాల వెల్లడి లేకుండానే ఈ వ్యాక్సిన్ ను వాడటానికి అనుమతిని ఇచ్చారనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో కేంద్రం వాదన కూడా పలు అనుమానాలకు తావిచ్చేదిలా ఉండటం గమనార్హం.
ముందుగా డీసీజీఐ అనుమతి ఇచ్చిన వైనాన్ని గమనిస్తే.. బ్రిటన్ లో రూపొందించిన కోవీషీల్డ్ తో పాటు, కోవ్యాగ్జిన్ ను కూడా వాడుకోవడానికి అనుమతిని ఇచ్చింది. అయితే అందుకు పలు షరతులున్నాయి.
వాటి సంగతలా ఉంచితే..అసలు కోవ్యాగ్జిన్ కు సంబంధించి ట్రయల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలనే ప్రకటించడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఆ పార్టీ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేష్ తదితరులు ఈ అభ్యంతరాలను ప్రస్తావించారు.
పూర్తి స్థాయి ప్రయోగాలు చేయకుండా ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆ వ్యాక్సిన్ ఇచ్చి వారిని ఏం చేస్తారు? అనేది వారి ప్రశ్న. అయితే ఈ విషయంలో బీజేపీ ఎదురుదాడినే నమ్ముకుంది. కాంగ్రెస్ వాళ్లకు భారతీయుల త్యాగాలు, ఘనతలు నచ్చవని.. అందుకే కో వ్యాగ్జిన్ ను కాంగ్రెస్ నేతలు తప్పు పడుతున్నారని బీజేపీ వాళ్లు తమ రొటీన్ ఎదురుదాడి చేస్తున్నారు.
ఇదే సమయంలో సైనికుల త్యాగాలు అంటూ మాట్లాడుతూ కమలం పార్టీ వాళ్లు.. తమదైన రాజకీయం చేస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ గురించి ప్రతిపక్షం అడిగితే.. సైనికుల త్యాగాలు, కాంగ్రెస్ కు దేశమంటే నచ్చదు అని బీజేపీ విమర్శలు చేస్తూ ఉండటం ఏమిటో మరి!
ఇక ఇదే సమయంలో కేంద్ర వైద్యారోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ ప్రకటన మరో రకంగా ఉంది. విజయవంతంగా పని చేసే అవకాశాలున్నాయని ఆయన అంటున్నారు! వ్యాక్సిన్ కోట్ల మందిపై ప్రయోగించే తరుణంలో ఇంకా అవకాశాలున్నాయని మాత్రమే ఆయన అంటున్నారు!
ఈ వ్యవహారంలో ఎయిమ్స్ డైరెక్టర్ ప్రకటన చూస్తే.. అది ఇంకో రకంగా ఉంది! 'భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమే. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ తొలిదశలో ఆక్స్‌ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకానే వాడతాం.
కోవిషీల్డ్ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌కు కోవాగ్జిన్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.' అని రణ్ దీప్ గులేరియా ప్రకటించారు! అంటే కో వ్యాగ్జిన్ ను వాడటం లేదు. బీజేపీ చెబుతున్న దేశపు ఘనత కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే!
బ్రిటన్ లో రూపొందిన, సీరమ్ తయారు చేస్తున్న కోవీ షీల్డ్ టీకాను మాత్రమే వాడబోతున్నట్టుగా ఎయిమ్స్ డైరెక్టర్ స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ కోవీ షీల్డ్ పని చేయకపోతే.. కేవలం ప్రత్నామ్నాయంగా మాత్రమే కో వ్యాగ్జిన్ ను ఉపయోగించుకోవచ్చని సాక్షాత్ ఎయిమ్స్ డైరెక్టర్ చెబుతున్నారు.
వ్యాక్సిన్ వెనుక లోగుట్టు ఇదేనేమో! ఎయిమ్స్ డైరెక్టర్ ప్రకటనను బట్టి చూస్తే.. కోవ్యాగ్జిన్ కేవలం మిథ్య. గత ఏడాది ఆగస్టు 15కే వచ్చేస్తోందంటూ కేంద్రం చేసిన ప్రకటన అప్పట్లోనే డొల్ల అని తేలింది. ఇప్పుడు కూడా కో వ్యాగ్జిన్ కు అనుమతిని ఇచ్చారు కానీ దాన్ని వాడటం లేదు.
బ్రిటన్ టీకాను మాత్రమే వేయబోతున్నారు. అలాంటప్పుడు కో వ్యాగ్జిన్ కు పర్మిషన్ ఇచ్చేసినట్టుగా ప్రకటించి, ట్రయల్స్ గురించి ప్రతిపక్షం అడిగితే ఎదురుదాడి చేయడం ఏమిటో!