ఇప్పుడు ఓటీటీ విడుద‌ల‌లా..స్టార్ హీరోల‌పై ఫైర్!

ఒక‌వైపు క‌రోనా అనంతర ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డుతూ ఉన్నాయి. ఎంత‌లా అంటే.. థియేట‌ర్ల‌లో సినిమాలు విడుద‌ల అయ్యేంత‌లా. ఇప్ప‌టికే తెలుగులో ఓ మోస్త‌రు సినిమా ఒక‌టి విడుద‌లై, ఫ‌ర్వాలేద‌నిపించే స్థాయిలో జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు క‌దిలించింది.…

ఒక‌వైపు క‌రోనా అనంతర ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డుతూ ఉన్నాయి. ఎంత‌లా అంటే.. థియేట‌ర్ల‌లో సినిమాలు విడుద‌ల అయ్యేంత‌లా. ఇప్ప‌టికే తెలుగులో ఓ మోస్త‌రు సినిమా ఒక‌టి విడుద‌లై, ఫ‌ర్వాలేద‌నిపించే స్థాయిలో జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు క‌దిలించింది.

ప్ర‌జ‌లు మ‌రీ బెంబేలెత్తి పోవ‌డం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. సుదీర్ఘ ప్రాంతాల‌కు రైళ్ల‌లో, బ‌స్సుల్లో జ‌ర్నీలు చేస్తున్నారు. ఈ ధైర్యానికి తోడు కాస్త ఆస‌క్తి ఉన్న వాళ్లు థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూడ‌టానికి సై అంటున్న‌ట్టుగా ఉన్నారు.

ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. మ‌రో నెల‌కో, రెండు నెల‌లకో ప‌రిస్థితులు పూర్తిగా చ‌క్క‌బ‌డ‌వ‌చ్చు. కొత్త స్ట్రెయిన్లను ఆరంభంలోనే అడ్డుకోగ‌లిగితే.. క‌రోనా ప‌రిస్థితులు పూర్తిగా నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చిన‌ట్టే అవుతుంది. 

అప్పుడు సినిమాల‌కు ఎదురుండ‌క‌పోవ‌చ్చు. ఇలాంటి నేప‌థ్యంలో.. కొంత‌మంది స్టార్ హీరోలు ఓటీటీ యాప్ ల ను ఎంచుకోవ‌డంపై విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేదు.

ఏవో చిన్న సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఓటీటీ లో విడుద‌ల అయితే ఎవ‌రూ ఏమ‌నుకునేది లేదు. అయితే కాస్త ఓపిక ప‌ట్టాల్సిన స్టార్ హీరోలు ఆ దారిని ఎంచుకోవ‌డంపై ప‌రిశ్ర‌మ వ‌ర్గాల నుంచినే విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఓటీటీ క్యూలో ప్ర‌ముఖ సినిమాలున్నాయి. వాటిల్లో మ‌ల‌యాళీ సినిమా  'దృశ్యం-2', నాగార్జున సినిమా 'వైల్డ్ డాగ్' ఉన్నాయి. ఈ సినిమాలు త్వ‌ర‌లోనే డిజిట‌ల్ స్ట్రీమింగ్ యాప్స్ లో విడుద‌ల కాబోతున్నాయి. 

ఈ సినిమాల‌ను మ‌రో ప‌క్షం రోజుల త‌ర్వాత థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసినా, అలా కాద‌నుకుంటే ఒక నెల రోజులు వాయిదా వేసి థియేట‌ర్ల‌కు వ‌దిలినా పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌క‌పోవ‌చ్చు. ఇలాంటి సినిమాలు జ‌నాల్లో ఆస‌క్తిని క‌లిగించి థియేట‌ర్ల‌కు అల‌వాటు చేయ‌గ‌ల‌వేమో!

అయితే.. వాటి రూప‌క‌ర్త‌ల‌కు, హీరోల‌కు మాత్రం ఇప్పుడు ఓపిక ప‌ట్టే ఉద్దేశం లేన‌ట్టుంది. మోహ‌న్ లాల్ కానీ, నాగార్జున కానీ త‌మ సినిమాల‌ను థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌ని కోరితే వాటి రూప‌క‌ర్త‌లు అభ్యంత‌రం చెప్పే ప‌రిస్థితి ఉండ‌దు. అయితే ఆ హీరోలు కూడా ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టుగా లేరు. 

త‌మ సినిమాల డిజిట‌ల్ రిలీజ్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా ఉన్నారు. మొద‌ట్లో జ్యోతిక సినిమాను డిజ‌ట‌ల్ లో విడుద‌ల చేయ‌డానికి సూర్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ప్పుడు త‌మిళ‌నాట థియేట‌ర్ల వ‌ర్గాలు విరుచుకుప‌డ్డాయి. 

ఆ త‌ర్వాత సూర్య సినిమానే ఓటీటీలో విడుద‌ల అయ్యింది. ఇప్పుడు దృశ్యం-2 ఓటీటీ విడుద‌లకు రెడీ అవుతున్న నేప‌థ్యంలో మోహ‌న్ లాల్ పై అలాంటి విమ‌ర్శ‌లే వ‌స్తున్నాయి. 

చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం