రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కమ్మ సామాజిక వర్గం కాబట్టే…జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా పనిచేశారని భావిస్తున్నారా? అని ఓ ప్రముఖ చానల్ యాంకర్ ప్రశ్న. ఈ ప్రశ్నకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ సినీ, రాజకీయ సెలబ్రిటీ సమాధానం ఏమై ఉంటుందనుకుంటున్నారు? ఆ సమాధానం కావాలంటే ఈ కథనాన్ని చదవండి.
ఫేస్ 2 ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ రచయిత, రాజకీయ నాయకుడైన పోసాని కృష్ణమురళిని ఓ ప్రముఖ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా రాజధాని రైతుల ఉద్యమం, మద్యం, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై తనదైన శైలిలో పోసాని సమాధానాలిచ్చారు. ఇందులో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడం వల్లే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను జగన్ సర్కార్ ఎన్నికల కమిషనర్‌గా తొలగించిందనే వాదనపై మీరేమంటారని పోసానిని యాంకర్ ప్రశ్నించాడు.
దీనిపై పోసాని స్పందిస్తూ…నిమ్మగడ్డ వ్యవహారం తనకెంత మాత్రం నచ్చలేదన్నారు. ఇండియా మొత్తంలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మాదిరిగా ఏ అధికారి ప్రవర్తించలేదని దుయ్య బట్టారు. తాను ప్రభుత్వానికి, రాజ్యాంగానికి అతీతమన్నట్టు కనీసం ప్రభుత్వంతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు, ఏం కొంపలు మునిగిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వంపై అభ్యంతరకర భాషలో కేంద్రానికి లేఖ రాశారని నిలదీశారు. నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వంపై వాడిన భాష గురించి ఏమనుకోవాలని పోసాని ప్రశ్నించారు.
అలాగే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కమ్మ కాబట్టే…జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని అనుకుంటున్నారా అనే ప్రశ్న పోసానికి ఎదురైంది. పోసాని ఏ మాత్రం తడుముకోకుండా ఆవేశంగా రియాక్ట్ అయ్యారు.
అనుకోవాలి? ఎందుకు అనుకోకూడదు అని చెప్పి…నిమ్మగడ్డ చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టే, జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అభిప్రాయాన్ని బలపరిచేలా పోసాని మాట్లాడారు. దేశ ఎన్నికల ప్రధాన అధికారి శేషన్ సిన్సియర్ ఆఫీసర్ అని, చచ్చేంత వరకూ అదే పేరుతో ఆయన బతికారని గుర్తు చేశారు. మరి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సిన్సియర్ ఆఫీసర్ అయితే…ఈ విమర్శలు ఎందుకని ప్రశ్నించారు.
బీజేపీ కమ్మ నాయకులు ఆ సుజనాచౌదరి, మరొకరి (కామినేని శ్రీనివాస్)తో అక్కడెక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో కలిసేందుకు ఎందుకు వెళ్లావని నిమ్మగడ్డను నిలదీశారు. ఆ టైంలో వెళ్లాల్సిన అవసరం నీకేంటి? ఏమైనా దేశ భవిష్యత్ గురించి మాట్లాడు కోడానికి కలుసుకున్నారా? అతనికి ఏమైనా ఎథిక్స్ ఉంటే…అసలే గొడవగొడవగా ఉంది రా బాబు అంటూ తప్పించుకోవాలి కదా? అని ప్రశ్నించారు.
సుజనాచౌదరిని కలుసుకోడానికి గుడ్డ కప్పేసుకుని ఆ హోటల్‌కు వెళ్లాల్సిన పనేం ఉందని మరోసారి నిలదీశారు. ఏ పదవి కోసం పాకులాడావ్? ఎలక్షన్ గురించి మాట్లాడ్డానికి వెళ్లావా? అంటూ నిమ్మగడ్డపై పోసాని ఫైర్ అయ్యారు.