ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బెయిల్ పిటిషన్‌పై బుధవారం తుది తీర్పు వస్తుందని అందరూ భావించారు. దీంతో ఉదయం నుంచి సీబీఐ కోర్టు తీర్పు కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కానీ సీబీఐ కోర్టు మరోసారి వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేయడంతో ప్రజలు, రాజకీయ నేతలు నిరుత్సాహంతో నిట్టూర్పులు విడిచారు.
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో నాలుగు నెలల క్రితం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలంటూ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. జగన్ బెయిల్‌కు సంబంధించి వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. విజయసాయిరెడ్డి బెయిల్‌పై బుధవారం వాదనలు ముగిశాయి.
ఈ నేపథ్యంలో రెండు పిటిషన్లపై ఒకేసారి తీర్పు చెబుతామని నాంపల్లిలోని సీబీఐ కోర్టు వెల్లడించింది. దీంతో విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఈ పరంపరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు పార్టీలో నెంబర్ 2గా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డి బెయిల్‌పై మరో మూడు వారాలు ఉత్కంఠ కొనసాగనుంది. జగన్ బెయిల్ రద్దు కావాలని కోరుకుంటున్న వారు మరో మూడు వారాలు తీర్పు కోసం వేచి ఉండక తప్పదు.