ఎమ్మెల్యే మంత్రి అయితే జనాల తాకిడి ఎక్కువ వుంటుంది అని ఇంటి పక్క ఓ షెడ్ వేస్తారు. దానికి సమావేశ మందిరం అని పేరు పెడతారు. తీరా మంత్రి పదవి వూడాక, దాని అవసరం లేదనిపించాక, తీసేస్తారు..అదేమైనా అంతర్జాతీయ సమస్యనా?
చంద్రబాబు నిర్మించుకున్న ప్రజావేదిక కూడా అలాంటిదే. ఆయన తీసుకున్న అద్దె ఇంటికి (స్వంత ఇల్లు కాదు) పక్కన ప్రజాధనంతో ఓ భారీ షెడ్ నిర్మించారు. పార్టీ జనాలను కలుసుకోవడం కోసం. అసలు ఆయన తీసుకున్న అద్దె ఇల్లునే అక్రమ నిర్మాణం అంటే, కరకట్ట సమీపంలో ఈ షెడ్ నిర్మించారు.
కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని కూల్చేసింది. ఇది ఓ అంతర్జాతీయ సమస్యలా కనిపిస్తోంది తెలుగుదేశం అనుకూల మీడియాకు. జగన్ ఆరునెలల్లో చేసిన తప్పిదాల్లో ( ఆ మీడియా దృష్టిలో) ప్రజా వేదిక కూల్చివేత ను కూడా చేర్చేసింది.
'అన్న' పథకాల మాటేమిటో?
చంద్రన్న కానుక, చంద్ర 'అన్న క్యాంటీన్లు', చంద్రన్న పసుపు కుంకుమ, చంద్రన్న సైకిళ్ల పంపిణీ, చంద్రన్న రైతులకు సాయం, ఇలా అనేకానేక విధాలైన డబ్బుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది ఎవరు? చంద్రబాబు కాదా? రోజుకు 15 రూపాయలతో టిఫిన్, భోజనం, రాత్రి టిఫిన్ గడిచిపోయేలా చేసింది ఎవరు? ఇది కేవలం పేదవారు మాత్రమే ఉపయోగించుకున్నారా? దీని వల్ల మనిషికి దాదాపు 150 రూపాయల వరకు ప్రభుత్వం భరించింది వాస్తవం కాదా? అపాత్ర దానం వల్ల ఎంత వృధా.
ఇవన్నీ ప్రభుత్వం తన కోసం చేసుకున్న సంక్షేమపథకాలు కావా? పార్టీని మళ్లీ ఎన్నికల్లో గెలిపించుకొవడం కోసం కాదా? మరి ఇవే పనులు జగన్ చేస్తే, అవన్నీ తప్పు అయిపోతాయా? ఇలాంటి అటు అయితే తప్పు, ఇటు అయితే ఒప్పు లాంటి వార్తలు రాస్తేనే కదా బాబు గారి అను'కుల' మీడియా అని అనేది?