ఎన్నికల్లో ఓటమికి స్వీయ తప్పిదాల కంటే, ఇతర కారణాలనే ఎక్కువగా వెదికే చంద్రబాబుకి రాష్ట్రంలో అధికార యంత్రాంగం తమకు పూర్తిగా సహాయ నిరాకరణ చేసిందనే అపోహ ఉంది. ఎన్నికల సమయంలో, ఫలితాలకు ముందు అధికారులు పూర్తిగా చంద్రబాబు మాట వినలేదు. కొత్త చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పూర్తి స్వేచ్ఛగా పనిచేశారు, అటు పోలీస్ విభాగం కూడా ఈసీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించింది. దీంతో చంద్రబాబు ఆటలు సాగలేదు.
అప్పట్నుంచీ అటు రెవెన్యూ, ఇటు పోలీస్ డిపార్ట్ మెంట్ పై చంద్రబాబుకి ఓ రకమైన విద్వేషం నెలకొని ఉంది. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా.. ఇంకా అధికారులు తన మాట వినాలనే అనుకుంటున్నారు చంద్రబాబు, అందుకే వైరిపక్షాలకు తోడు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపైనా విరుచుకుపడుతున్నారు.
అమరావతి పర్యటనలో తనపై జరిగిన దాడికి పూర్తిగా డీజీపీయే కారణమంటూ వితండవాదం చేస్తున్నారు బాబు. టీడీపీ నేతలతో కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ కి వ్యతిరేకంగా జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెట్టించారు. వైసీపీ చేతిలో కీలుబొమ్మగా డీజీపీ మారారని, ఆయనకి తగ్గట్టుగానే ఉద్యోగులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ విమర్శించారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇలాంటి తీవ్రవ్యాఖ్యలు చంద్రబాబు చేశారు, ప్రతిగా పోలీస్ అధికారుల సంఘం నేతలు నిరసనలు చేశారు.
కలెక్టర్ల దగ్గర్నుంచి రెవెన్యూ సిబ్బందిపై కూడా చంద్రబాబు విషం కక్కుతూనే ఉన్నారు. స్పందన కార్యక్రమంలో టీడీపీ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం లేదని, కేవలం వైసీపీ నేతలు, కార్యకర్తలకే అధికారులు వంత పాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ గా ఉండగా ఎంత రాద్ధాంతం చేసిందీ చూశాం, చివరకి ఆయన బదిలీని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకున్నారు చంద్రబాబు.
ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయించుకునేందుకు సరిగ్గా ఆ టైమ్ కి అన్ని విభాగాల్లో పెద్దల్ని ఏరికోరి తెచ్చుకున్నారు చంద్రబాబు. అయితే కిందిస్థాయి సిబ్బంది వారి మాట వినలేదు, ఈ విషయంలో చంద్రబాబు సీరియస్ అయినా చేసేదేం లేకపోయింది. అప్పటికే ఈసీ అజమాయిషీ రావడంతో ఎవరూ భయపడలేదు. దీంతో వారందరి వివరాలు తెప్పించుకుని, వ్యక్తిగతంగా కూడా బెదిరించాలని చూశారు టీడీపీ నేతలు.
ఒకవేళ టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే వారందరి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడమే కష్టం. అదృష్టవశాత్తు అది జరగలేదు కాబట్టి, ఎన్నికల సమయంలో నిక్కచ్చిగా పనిచేసిన అధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు మాత్రం ఇంకా విమర్శించడం మానలేదు. వైసీపీతో పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు కుమ్మక్కైపోయాయని విద్వేష ప్రసంగాలిస్తున్నారు.