లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మ అనుకున్నదొకటి, అయింది మరొకటి. ఎన్నికల సీజన్లో ఆ సినిమా విడుదల చేసి కలెక్షన్లు కుమ్మేద్దామనే ప్లాన్ వేశాడు వర్మ, కానీ ఏపీలో సినిమా విడుదలకు కోర్టు అడ్డుపడింది. తీరా థియేటర్లలోకి వచ్చే సమయానికి తెలంగాణలో రిలీజైన ప్రింట్ మొబైల్స్ లోకి వచ్చేసింది. అసలు ఏపీలో ఈ సినిమా ఎప్పుడు విడదలైంది, ఎన్నిరోజులు ఆడిందీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు కమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటూ మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఇరగదీద్దామనుకున్నారు వర్మ.
కానీ ఇక్కడ కూడా వ్యవహారం కోర్టుకెక్కడంతో బ్రేక్ పడింది. ఇంతకీ సినిమాకు ఎన్ని కట్స్ పడతాయి, పప్పులాంటి అబ్బాయి పాట పరిస్థితి ఏంటి, అసలు ఎప్పుడు రిలీజవుతుంది.. అనే అంశాలన్నీ సస్పెన్స్ లో పడ్డాయి. పోనీ వర్మకు మరీ కాలితే అన్ సెన్సార్డ్ వెర్షన్ ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసుకోవచ్చు కాక, దానివల్ల లాభమేంటి, సినిమా సినిమా అంటూ హడావిడి చేసి యూట్యూబ్ వెబ్ సిరీస్ గా మార్చేస్తే నిర్మాతలకి ఏంటి ప్రయోజనం. ఈ ప్రశ్నలన్నిటికీ వర్మే సమాధానం చెప్పాలి.
వర్మ సినిమాలు కేవలం పబ్లిసిటీకే పనికొస్తాయి తప్ప కలెక్షన్లకు కాదు అని కొన్నేళ్లుగా ఆయన నుంచి వస్తున్న ప్రతి ఆణిముత్యం రుజువు చేస్తూనే ఉంది. అయినా కూడా సెన్సార్ బోర్డుపై తప్పు వేస్తూ ఆయన తనకు నచ్చినట్టు సినిమాలు తీసుకుంటూ, తనకు నచ్చిన టైటిల్స్ పెడుతూ పోతున్నాడు. రేపు అమ్మరాజ్యం అని టైటిల్ మార్చినా, పబ్లిసిటీ మెటీరియల్ అంతా కమ్మరాజ్యంగానే బైటకు వెళ్తుంది, అందులో వర్మ తెలివితేటలకు వచ్చిన ఢోకా ఏమీ లేదు.
కానీ ఎన్నాళ్లిలా సెన్సార్ బోర్డ్ ని తిడుతూ వర్మ సినిమాలు తీస్తుంటారు? తీసేముందు దీనికి సెన్సార్ సమస్య వస్తుందనే విషయం ఆయనకు తెలియదా? తెలిసినా గుడ్డిగా ముందుకెళ్లడం, ప్రతి రిలీజ్ కి ముందూ వెనక్కి తగ్గి మార్పులు చేసుకోవడం, ఎందికీ అవస్థ. పోనీ ఆయన చేసిన రిస్క్ వల్ల సినిమాలు బ్రహ్మాండంగా ఆడి కలెక్షన్లు కొల్లగొడుతున్నాయా అంటే అదీ లేదు.
ప్రేక్షకుల అభిరుచి మారింది, యూట్యూబ్ టైటిళ్లకు కాలం చెల్లింది. లోపల మెటీరియల్ ఏంటి అనే అంచనాకు వచ్చేస్తున్న మేథావులే జనాల్లో ఎక్కువమంది ఉన్నారు. రాగాపోగా వారిని అంచనా వేయడమే వర్మకు కష్టమైపోయింది. అందుకే ఈ చీప్ ట్రిక్స్.. చీప్ పబ్లిసిటీ.