విశాఖ రాజధాని ఏంటి అని ఇపుడు కొన్ని నోళ్ళు ఎకసెక్కం చేస్తున్నాయి. విశాఖ రాజధాని వద్దు అని మరికొంతమంది పచ్చపాతంతో మాట్లాడుతున్నారు. విశాఖ రాజధాని అన్నది ఇవాళ్టి ముచ్చట కాదు, ఇప్పటికి 67 ఏళ్ల నాడు ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడిన రెండు నెలలకే ప్రస్తావన వచ్చింది.
అపుడు తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నారు. ఈ రోజు ఆయన 148వ జయంతి. ఆయనను స్మరించుకుంటూ నాడు జరిగిన కధ ఏంటో తెలుసుకోవాలి. ప్రకాశం పంతులు నాడు సీఎంగా ఉన్న కర్నూలు అసెంబ్లీలో విశాఖను రాజధానిగా చేయాలన్న బిల్లు మీద పెద్ద చర్చ జరిగిన సంగతి ఈనాటి తరాలకు తెలియదు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన రొక్కం లక్ష్మీనరసింహం దొర నాడు విశాఖ రాజధాని కోరుతూ ఒక ప్రైవేట్ బిల్లు పెడితే దాన్ని మీద చర్చకు నాటి సభ అనుమతించింది. ఆ బిల్లు రెండు ఓట్ల తేడాతో నెగ్గింది కూడా. అంటే విశాఖ రాజధాని కావాలని నాడే తీర్మానం చేశారన్నమాట.
అంతే కాదు 1954లో విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా ముఖ్యమంత్రి హోదా ప్రకాశం పంతులు నిర్వహించారు. విశాలాంధ్రా కనుక ఏర్పాటు కాకపోతే విశాఖకు షిఫ్ట్ అయిపోదామని దాదాపుగా నాడు అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో భావించాయి.
అయితే ఉమ్మడి ఏపీగా తెలంగాణాను కలుపుకుని కొత్త రాష్ట్రం రావడంతో హైదరాబాద్ కొత్త క్యాపిటల్ అయింది. అంటే ఒక విధంగా విశాఖ రాజధాని కావాలన్నది తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి కోరిక కూడా. చరిత్రలో నిజాలు ఇలా ఉంటే విశాఖను ఎందుకూ పనికిరాదని తీసివేయడం అంటే ఇది కచ్చితంగా రాజకీయం కాక మరేమవుతుంది.