విజయవాడ ఎంపీ కేశినేని నాని వినేవాళ్లుంటే సోది ఎంతైనా చెబుతారు. ప్రత్యర్థులను వేలెత్తి చూపే ముందు…ఒక్కసారి తనవైపు మిగిలిన నాలుగు వేళ్లు తనవైపు ఉన్నాయనే స్పృహ ఉంటే జాగ్రత్తగా మాట్లాడుతారు. కానీ ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతలకు ఆ సోయ అసలుండడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజలు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి అధికారం అప్పగించారు. కానీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు సర్కార్ చేయని దుర్మార్గం అంటూ లేదు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీ కాళ్లు, చేతులు విరగ్గొట్టి మూలన కూచోపెట్టారు. అయితే తమ తప్పిదాలను ఇప్పటికైనా గుర్తించి, పశ్చాత్తాపం చెంది…తిరిగి పూర్వ వైభవం తెచ్చుకునేందుకు పాప ప్రక్షాళన చేసుకోవాలనే విజ్ఞత లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పచ్చి మోసకారి అని కేశినేని నాని విమర్శిస్తున్నారంటే ఎంత తెంపరితనమో అర్థం చేసుకోవచ్చు.
పాలనలో జగన్ విఫలమయ్యారని, 22 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని ఇప్పుడు మాట్లాడ్డం లేదని ఆయన విమర్శించారు. కేసులు నుండి బయట పడటానికి కేంద్రంతో లాబీయింగ్ చేశారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు కాదని ఆయన ఆరోపించారు. కేశినేని నాని ఆరోపిస్తున్నట్టుగానే జగన్ తనపై కేసుల కొట్టివేత కోసం కేంద్రంతో లాబీయింగ్ చేస్తున్నారనే అనుకుందాం. మరి ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రశ్నించడానికి తన పార్టీకి భయం ఎందుకో నాని చెప్పాలి.
అవసరం ఉన్నా లేకున్నాప్రధాని మోడీని తమ అధినేత చంద్రబాబు ఎందుకు ఆకాశానికెత్తుతున్నారో నాని చెప్పాల్సిన అవసరం ఉంది.సీఎం సీటు జగన్‌కు శాశ్వతం కాదని, హిట్లర్ లాంటి వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని హితవు చెబుతున్న నానికి…తమ పార్టీ ఐదేళ్లు పరిపాలనలో ఉన్నప్పుడు ఇవేవీ గుర్తుకు రావడం లేదా? నడిరోడ్డుపై రవాణాశాఖ అధికారిపై నాటి ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి విజయవాడలో నాని చేసిన రౌడీయిజాన్ని రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు.
బహుశా నాని మరిచిపోయినట్టున్నారు. ఇప్పుడు టీడీపీ కాలగర్భంలో ఎందుకు కలిసిపోతున్నదో సమీక్షించుకుంటే మంచిది. జగన్ చరిత్ర ఎంతో హీనమని నాని నోటు దురుసు ప్రదర్శించారు. ఇలాంటి వైఖరి వల్లే శాశ్వతంగా అధికారానికి దూరమయ్యే పరిస్థితి వచ్చిందని గ్రహించి ఉంటే….నాని నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చేవి కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.