ప్రధానిః హాలో నమస్కారం. నేను మోడీని సార్. ఎలా ఉన్నారు
ఆర్కేః బాగున్నా. మోడీ అంటే వెంటనే గుర్తు రావడం లేదు. మీరెవరు, ఏం చేస్తుంటారు?
ప్రధానిః నేను మన దేశ ప్రధాని సార్. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా కాలం పనిచేశాను.
ఆర్కేః ఓ..నమస్కారం మోడీ గారు. ఈవేళ ఉదయమే కదా మీతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడింది. మళ్లీ మీరే ఫోన్ చేయడంతో…మీ నుంచి ఇలాంటివి అసలు ఎక్స్ఫెక్ట్ చేయలేదు. క్షమించండి సార్.
ప్రధానిః ఫర్వాలేదు సార్. విపత్కర పరిస్థితుల్లో మీలాంటి పెద్దవాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడి, సలహాలు, సూచనలు స్వీకరించాలని నా చిన్నప్పుడు చదువు చెప్పిన గురువులు బోధించారు.
ఆర్కేః అయ్యో ఎంత మాట. ఎక్కడో ఢిల్లీలో ఉన్న మీరు నన్ను గుర్తించారే కానీ, నాకు అతి సమీపంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మరికొంత దూరంలో ఉన్న ఏపీ సీఎం జగన్ గుర్తించలేకపోయారే. మీరు ఫోన్ చేసిన ఆనందం కంటే…కనీసం వాళ్లిద్దరూ నన్నెప్పుడూ మనిషిగా గుర్తించలేదనే బాధే నా మనసును కష్టపెడుతోంది.
ప్రధానిః వాళ్లను మీరు పట్టించుకోవద్దు. మీలాంటి పెద్ద వాళ్లను గుర్తించాలంటే పెద్ద మనసు ఉండాలి. మీలాంటి మేధావుల గురించి తెలియాలంటే అవతలి వైపు వాళ్లకు తెలివితేటలుండాలి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను.
ఆర్కేః అర్థమైంది సార్. ఇన్నేళ్లుగా నెత్తిన మోస్తున్న చంద్రబాబు కూడా ఏనాడూ ఇలాంటి రెండు మంచి మాటలు చెప్పలేదు. అలాంటిది మిమ్మల్ని కించపరుస్తూ అనేక కథనాలు వండివార్చిన నాకు అదే పనిగా ఫోన్ చేశారంటే….
ప్రధానిః అంత మాట అనకండి ఆర్కే గారు. ఉదయం వీడియో కాన్ఫరెన్స్లో దేశ వ్యాప్తంగా అనేక మంది పత్రికాధిపతులతో సమావేశం కావడం వల్ల మీతో వ్యక్తిగతంగా మాట్లాడలేకపోయాను. అందుకే జాతినుద్దేశించి ప్రసంగించిన వెంటనే మీరే గుర్తుకొచ్చారు. కరోనాపై పోరాటం, మూడు వారాల కర్ఫ్యూ విషయంలో మీ నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలనే సదాశయంతో మీకు ఈ టైం(రాత్రి 8.40)లో కూడా ఫోన్ చేశాను. కావున సలహాలు, సూచనలిస్తే…నోట్ చేసుకుని మీ శత్రువులైన కేసీఆర్, జగన్ అమలు చేసేలా చర్యలు తీసుకుని తిక్క కుదుర్చుతాను.
ఆర్కేః నాక్కావాల్సింది కూడా అదే సార్. చెబుతా, నోట్ చేసుకోండి. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో ఈ మూడు వారాల్లో నిత్యావసర సరుకుల సరఫరా ప్రధాన సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఇంటింటికి తెచ్చుకోవడం కష్టం. కావున నిత్యావసరాల సరఫరా బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలి. నిత్యావసరాల బ్లాక్ మార్కెటింగ్ ఇప్పటికే మొదలైంది. ఆ జగన్, కేసీఆర్ తమతమ రాష్ట్రాల్లో తమవాళ్లను నియమించుకుని దోచుకుంటున్నారు. అంతేకాదు సీఎంలిద్దరూ రాబోయే రోజుల్లో ధరలు పెంచే ప్రమాదం ఉంది. లాక్డౌన్పై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మీకు చెడ్డపేరు తెచ్చేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ ఏం చేయడానికైనా వెనుకాడరు సార్.
ప్రధానిః అబ్బా ఎంత మంచి సూచన సార్. అంతేకాదు, నేను ఒకటి అడిగితే మీరు రెండుమూడు విషయాలు చెప్పారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా నన్న అప్రతిష్టపాలు చేయడానికి ఆ జగన్, కేసీఆర్ కుట్రల్ని మీరు కాబట్టి ధైర్యంగా చెప్పగలిగారు. ఎంతైనా మీరు నా శ్రేయోభిలాషి. మీకు ఫోన్ చేయడం వల్ల ఎంత మంచి జరిగిందో చూడండి. లేకపోతే కుట్ర కోణాలు అసలు బయటికి వచ్చేవే కాదు.
ఆర్కేః నేను ఎప్పుడూ మంచి సూచనలు, సలహాలు ఇస్తుంటాను. మా చంద్రబాబుకు కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో అనేక సలహాలు, సూచనలు ఇచ్చాను. అయితే నేను చెప్పిన వాటిని ఆయన ఏ మాత్రం పాటించలేదు. అందుకే ఆ గతి పట్టింది.
ప్రధానిః ఇంతకూ ఎన్డీఏ నుంచి విడిపోవాలని బాబుకు సలహాలిచ్చిన వెధవ ఐడియా ఎవరిది సార్?
ఆర్కేః అది…అది….నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా?
ప్రధానిః అవసరం లేదు లెండి…మీ నసుగుడులోనే సమాధానం దొరికింది. ఎప్పుడైనా ఢిల్లీ వస్తే మోడీని కలవడం మరిచిపోవద్దు ఆర్కే గారు.
ఆర్కేః అయ్యో ఎంత మాట. నాతో పాటు బాబు గారిని కూడా… (ఏదో చెప్పబోతుండగా ఫోన్ కట్ అయ్యింది)