మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియాలో కనిపించకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. ఇంకా తాను సీఎం పదవిలో ఉన్నానని ఆయన భ్రమలో ఉన్నారు. పదేపదే మీడియా ముందుకొచ్చి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ….తానేదో సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నట్టు తనకు తానే జబ్బలు చరుకుంటుంటారు.
కరోనా విషయంలో కూడా ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని అప్రమత్తం చేసే పేరుతో ఆయన పదేపదే మీడియా ముందుకొస్తున్నారు. కరోనా వైరస్ లక్షణాలు, వ్యాప్తి, ఏ దేశంలో ఎలాంటి దుష్ఫలితాలు చూపుతున్నదనే వివరాలను ఆయన మీడియాకు వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే ప్రజల్లో అవగాహన, చైతన్యపరిచేందుకు ఎవరు ముందుకొచ్చినా అభినందనీయమే. కానీ ఆ పేరుతో రాజకీయంగా వాడుకోవాలనుకోవడమే అభ్యంతరకరం. అలాగే ప్రజల్ని భయపెట్టేలా చేయడం కూడా అంతకంటే అభ్యంతరకరం.
చంద్రబాబు ప్రజల్ని భయపెట్టేలా మాట్లాడుతున్నారు. కరోనా వైరస్ వల్ల మన దేశంలో 20 నుంచి 50 లక్షల మంది వరకూ చనిపోయే అవకాశం ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ (సీడీడీఈపీ) అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఈ మేరకు అంచనా వేసిందని కూడా వెల్లడించారు. ఇంకా ఈ సంస్థ అనేక విస్తుగొలిపే వివరాలు వెల్లడించింది.
బాబు చెప్పిన విషయాలు వాస్తవాలే కావచ్చు. బాబు సృష్టించనవో, కొత్తగా తానే కనిపెట్టినవో కాదు. బాబు చెప్పిన విషయాలు నిన్న అన్ని పత్రికలు, చానళ్లలో ప్రచురితమయ్యాయి, ప్రసారమయ్యాయి. కానీ బాబు చెప్పడం వల్ల ఆ వివరాలకు మరింత ప్రాచుర్యం లభిస్తుంది. దీనివల్ల జనాల్లో ఒక రకమైన భయాందోళనలు నెలకుంటాయి. ఒక్కోసారి సున్నిత మనస్కులు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు?
కరోనా వైరస్ను నిరోధించే చర్యల వరకు అవగాహన కల్పించేందుకు ఎవరైనా పరిమితమైతే బాగుంటుంది. కానీ దాని వల్ల ఇన్ని లక్షలు, అన్ని లక్షల మరణాలు సంభవిస్తాయని ఊహాజనిత వివరాలు చెప్పడం వల్ల…ఎటూ చచ్చిపోతాం కాబట్టి, ఇక 21 రోజుల స్వీయ నిర్బంధం, సామాజిక దూరం ఎందుకు పాటించాలనే నెగిటీవ్ ఆలోచనలు కలిగే ప్రమాదం ఉంది. సమాజానికి చెడు చేయాలనే తలంపుతో బాబు మాట్లాడి ఉంటారని ఎవరూ అనుకోరు. కానీ బాబు చెప్పిన వివరాలను విన్న వాళ్లకి నెగిటీవ్ ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉందనేదే బాధ. అందువల్ల మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించడం అందరికీ మంచిది.