హోదాలంటే మనుషులకు భయమో, భక్తో ఉంటాయి. హోదాలను బట్టి మనుషులు నడుచుకోవడం సహజం. కానీ కరోనా వైరస్‌కు హోదాలతో పనేంటి? ఇంకా చెప్పాలంటే …ఐతే ఏంటట? అని ప్రశ్నిస్తోంది కరోనా వైరస్.
కరోసా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. సాక్ష్యాత్తు ఒక దేశ ఆరోగ్యశాఖ మంత్రినే బలిగొన్న కరోనా వైరస్…ప్రపంచానికి ఓ సవాల్ విసిరింది. కరోనా వ్యాప్తికి పేద, ధనిక అనే తేడాలు చూపడం లేదు. తన వ్యాప్తికి అనువైన వాతావరణం ఉంటే చాలు…రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.
తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగొరీ కరోనా వైరస్ బారిన పడింది. ఈ విషయాన్ని కెనడా ప్రధాని కార్యాలయమే ప్రకటించింది. ఫ్లూ సంబంధిత లక్షణాలు కనిపించడంతో ఆమెను ఇంటికి పరిమితం చేశారు. తన భార్యకు కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో ప్రధాని ట్రూడో కూడా ఇంటి నుంచి తన కార్యకలాపాలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు.
ప్రధాని భార్య ఇటీవల బ్రిటన్‌లో పర్యటించారు. అక్కడ ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే ఆమెకు వైరస్ అటాక్ అయినట్టు అనుమానిస్తున్నారు. అయితే సోఫీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే కొంత కాలంగా సోఫీని కలిసిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సంబంధిత వైద్యాధికారులు వెల్లడించారు. కెనడా వైద్యుల లెక్కల ప్రకారం ఆ దేశంలో ఇప్పటికి 138 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో కెనడా ప్రధాని భార్య ఒకరు కావడం గమనార్హం.