భారతీయ పౌరసత్వ చట్టం సవరణలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలకు కౌంటర్ గా బీజేపీ దేశ వ్యాప్తంగా ర్యాలీలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఆదివారం రోజున దేశంలోని పలు నగరాల్లో ఈ పౌరసత్వ చట్టాన్ని సమర్థిస్తూ అనుకూల ర్యాలీలు సాగాయి. నాగ్ పూర్ లో ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సాగింది. దాంట్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. అలాగే కర్ణాటకలో కూడా అనుకూల ర్యాలీ సాగింది.
అందులో పాల్గొన్న నేతలు పౌరసత్వ చట్టం సవరణలను సమర్థించారు. అలాగే.. ఆ చట్టం ఇండియాలోని ముస్లింలకు వ్యతిరేకం కాదని వారు వ్యాఖ్యానించారు. భారతీయ ముస్లింలకు ఆ చట్టంతో వచ్చిన ఇబ్బంది లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, కొంతమంది అర్బన్ నక్సల్స్ ముస్లింలలో లేని పోని అపోహలు కలిగిస్తూ ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. సీఏఏ అమలైనా దేశీయ ముస్లింలు నిశ్చింతగా ఉండవచ్చని వారు భరోసాను ఇచ్చారు.
ఇలాంటి కౌంటర్ ర్యాలీలతో పౌరసత్వ చట్టం సవరణలను వ్యతిరేకిస్తున్న వారి ఆందోళనలకు చెక్ పెట్టడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. ఉద్రిక్తతలు నెలకొన్న చోట్ల కూడా ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి.
పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు ఎక్కిన వారూ జాతీయ జెండాలను తమ ప్రదర్శనలో ఉపయోగించుకున్నారు. ఇప్పుడు అనుకూల ఆందోళనల్లోనూ జాతీయ జెండానే వాడేస్తున్నారు!