సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో గురువారం చోటు చేసుకున్న పరిణామాలు ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగించాయి. అయినప్పటికీ అధికార పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బంగారు వ్యాపారానికి ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరు పట్టణంలో తాజా రాజకీయ పరిణామాలు ఒకింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు లేవు. పైగా ప్రత్యర్థి పార్టీ ఊసే లేని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్వపక్షంలోనే విపక్షం తయారు కావడం అధికార పార్టీకి మింగుడు పడడం లేదు.
ఇక్కడి నుంచి వైసీపీ తరపున రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన బామ్మర్ది బంగారురెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా అంతా తానై చక్రం తిప్పుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్బాషాపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లే మూకుమ్మడి దాడి వెనుక పార్టీ అంతర్గత విభేదాలు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనేందుకు తాజా రాజకీయ పరిణామాలే నిదర్శనం అని చెప్పొచ్చు. ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌కు 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా పరోక్షంగా మద్దతుగా నిలిచాడని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు. అతనిపై దాడి చేయడం ద్వారా పరోక్షంగా ఇతర కౌన్సిలర్లకు ఎమ్మెల్యే వర్గీయుల హెచ్చరిక పంపారనే చర్చ ప్రొద్దుటూరులో జరుగుతోంది.
ఎనిమిది నెలలుగా చిన్న సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంపై 13వ వార్డు కౌన్సిలర్ ప్రశ్నించడాన్ని అధికార పార్టీ కౌన్సిలర్లు అవకాశంగా తీసుకుని దాడికి పాల్పడ్డారనే విమర్శలున్నాయి. మున్సిపల్ చైర్మన్‌ను కించపరిచాడంటూ మహిళా కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సీఎస్ ఖాజా కలసి ఇతర కౌన్సిలర్లను రెచ్చగొట్టారు. ఈ నేపథ్యంలో 13వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషాపై ఎమ్మెల్యే బామ్మర్ది, వైస్ చైర్మన్ బంగారురెడ్డి సమక్షంలో చెప్పులతో దాడికి తెగబడడం ఏపీ సమాజాన్ని నివ్వెర పరిచింది.
పార్టీ పరువును బజారుకీడ్చింది. ఇంత జరిగినా కనీసం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న ఆలోచన అధికార పార్టీలో లేకపోవడం విమర్శలకు దారి తీసింది. ఇలాంటి వాళ్లను ఎన్నుకున్నందుకు తమను తాము చెప్పుతో కొట్టుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.