పుష్కలమైన వర్షాలు.. భూగర్భజలాలు పెరిగితేచాలు!

గత పదేళ్లలో కెళ్లా ఈ ఏడాది అత్యంత భారీస్థాయి వర్షపాతం నమోదు అవుతూ ఉందనే వార్తలు తెలుగువాళ్లను ఎంతో సంతోష పెడుతూ ఉన్నాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వర్షాలతో ప్రజలు కొంత ఇబ్బందిపడ్డారు. అయితే…

గత పదేళ్లలో కెళ్లా ఈ ఏడాది అత్యంత భారీస్థాయి వర్షపాతం నమోదు అవుతూ ఉందనే వార్తలు తెలుగువాళ్లను ఎంతో సంతోష పెడుతూ ఉన్నాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వర్షాలతో ప్రజలు కొంత ఇబ్బందిపడ్డారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు రైతులకు, సామాన్య ప్రజలకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి. ముందుగా మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన వర్షాలతో కృష్ణా, గోదావరి భారీఎత్తున ప్రవహించాయి. వాటి వల్ల ఏపీలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారాయి.

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు పుష్కలమైన నీటిలభ్యత ఆయకట్టు రైతులను సంతోషంతో ముంచెత్తింది. పులిచింతల కూడా పూర్తిస్థాయి మట్టానికి చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అయితే నీరు ఇప్పుడు అనంతపురం వరకూ చేరింది. రేపోమాపో చిత్తూరుజిల్లా వరకూ చెరువుల్లోకి కృష్ణా నీళ్లు చేరబోతూ ఉన్నాయి.

అయితే ఇదే సమయంలో భారీఎత్తున నీళ్లు  సముద్రం పాలయ్యాయి. సముద్రానికీ నీరు చేరాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఒక్క కృష్ణానది నుంచి సముద్రానికి చేరిన నీరే రెండు వందల అరవై టీఎంసీలని అంచనా. వాటిల్లో కనీసం వంద టీఎంసీ నీళ్లను నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా.. కరువు తీరేది.

శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి ఇలాంటి వరద సమయంలో అయినా నీళ్లను పంపే అవకాశం మరింతగా ఉంటే.. ఆ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగం ఉండేది. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో నీటి నిల్వకు తగిన ప్రాజెక్టులు లేవు. భారీఎత్తున నీళ్లను వదలడానికి అవకాశం లేదు. దీంతో నీరు కడలిపాలైంది. భవిష్యత్తులో అయినా అలాంటి పరిస్థితి నివారించాల్సి ఉంది.

అయితే వరుణుడి కరుణ కేవలం ప్రాజెక్టుల నీళ్లతోనే కాకుండా.. వర్షంతో కూడా లభించింది. తెలుగు రాష్ట్రాల్లో పుష్కలమైన వర్షాలు కురిశాయి. తెలంగాణలో అయితే వందేళ్ల వర్షాల రికార్డు చెరిగిపోయిందని అంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో వరదలు చోటు చేసుకున్నాయి. ఈ భారీ వర్షాలతో అయినా భూగర్భ జలాలు పైకి ఎగస్తే అంతకన్నా రైతులకు, రాష్ట్రాలకు కావాల్సింది మరేంలేదు.
-ఎల్‌.విజయలక్ష్మి

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి