వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజుపై ఇక పార్టీ వేటు వేయనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనపై ఇచ్చిన షోకాజ్ నోటీస్‌పై రఘురామకృష్ణంరాజు ప్రశ్నలే సమాధానంగా ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారంటూ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ నెల 23న షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే.
వారం, పదిరోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని పార్టీ కోరింది. అయినప్పటికీ రఘురామకృష్ణంరాజు అంత సమయం తీసుకోలేదు. నోటీస్ అందిన వెంటనే ఆయన తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు.
తనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన విజయసాయిరెడ్డిపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించడమే ఆయన సమాధానమైంది. అసలు ఆయన వైఎస్సార్‌సీపీ ఉనికినే ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారు? రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు?’ లాంటి ప్రశ్నలు సంధించి…మరోసారి ధిక్కార స్వరాన్ని వినిపించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రఘురామకృష్ణంరాజు మరింత దూకుడు ప్రదర్శించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని తనను ప్రశ్నించడంతో…అసలు వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఛైర్మన్, సభ్యులెవరు? క్రమశిక్షణ సంఘం మినిట్స్ ఉంటే తనకు పంపాలంటూ ఘాటుగా రిప్లై ఇవ్వడం చర్చనీయాంశమైంది. వైసీపీ, రఘురామకృష్ణంరాజు మధ్య వ్యవహారం తెగే వరకు వెళ్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫోకాజ్ నోటీస్‌కు సమాధానంగా పదునైన ప్రశ్నలు సంధించడం ద్వారా…బాల్‌ను వైసీపీ కోర్టులో విసిరినట్టైంది. ఇక వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే అంశంపై ఉత్కంఠ నెలకుంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఇప్పటికే విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజుపై వేటు తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.