రఘురామ కృష్ణంరాజు, టీవీ5 అధినేత మధ్య జరిగిన ఫోన్ సంభాషణ.. ఒక మిలియన్ యూరోల బదిలీ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈ వ్యవహారంపై వైసీపీ చేసిన ఆరోపణలను రాజకీయ విమర్శలుగానే చూశారంతా. యూరోలలో అసలు డీలింగ్ జరుగుతుందా అంటూ రఘురామ కూడా వెటకారం ఆడారు.
కట్ చేస్తే.. ఇప్పుడిది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ హవాలా వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ప్రధాని నరేంద్రమోదీని వైసీపీ పార్లమెంటరీ పార్టీ కోరింది. సీఐడీ వెలికి తీసిన వివరాలను కూడా ప్రధానికి సమర్పించారు వైసీపీ నేతలు.
ఈ ప్రైవేటు వ్యవహారాన్ని పబ్లిక్ చేసింది ఎవరనే విషయాన్ని పక్కనపెడితే.. ఈమధ్యే ఫీల్డ్ లోకి వచ్చిన రఘురామ ఈ చిన్న డీల్ ని బయటకు రాకుండా చూసుకోలేకపోయారనేది బహిరంగ రహస్యం. టీవీ ఛానెళ్లతో లావాదేవీలు పెట్టుకుని, రచ్చబండ పేరుతో తాను విడుదల చేసే వీడియోలని ప్రసారం చేయించుకోవడం, వాటిపై చర్చలు పెట్టడం, పదే పదే తాను హైలెట్ కావడం ఇలా చాలా విన్యాసాలు చేశారు రఘురామ. అయితే ఈ విన్యాసాలకు ఆద్యుడు చంద్రబాబు.
ఇప్పుడు కాదు, దశాబ్దాల క్రితమే ఆయన ఈ ప్లాన్ వర్కవుట్ చేశారు. మీడియాని గుప్పెట్లో పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు ఎప్పుడూ ఇలాంటి డీల్స్ బయటకు రానీయలేదు. అంత సీక్రెట్ గా వ్యవహారం నడిపేవారు.
రఘురామ ఎపిసోడ్ బయటపడిన తర్వాత చంద్రబాబు ఎంత తెలివైనోడో, ఎంత తెలివిగా మీడియాని మేనేజ్ చేస్తారో అనే విషయం మరోసారి బయటపడింది. ఎక్కడా మీడియాతో నేరుగా ఆయన డీల్స్ కుదుర్చుకోరు. నేరుగా నగదు బదిలీ వ్యవహారం ఉండదు. అంతా అధికారికంగా జరిగిపోతుంది.
వాణిజ్య ప్రకటనలతో లబ్ధి చేకూరుస్తారు. తక్కువ రేటుకి స్థలాలు ఇప్పించి తనకు చేసిన సాయానికి బదులు తీర్చుకుంటారు. అనేక ఇతర రూపాల్లో మేళ్లు చేసి తన పని పూర్తి చేసుకుంటారు. అందుకే మీడియా మేనేజర్ గా చంద్రబాబుకి అంత పేరున్నా.. ఎప్పుడూ ఇలా బయటపడలేదు.
రఘురామకృష్ణంరాజు వంటి చిన్న వికెట్లు ఎన్ని పడినా, చంద్రబాబు వంటి పెద్ద వికెట్ మాత్రం పడే అవకాశం ఉండదు. ఒకవేళ కేసులున్నా.. వ్యవస్థలతో వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలో బాబుకి బాగా తెలుసు. అది తెలుసుకోలేకే రఘురామ, బాబు ఆడుతున్న ఆటలో పావుగా మారారు.
సొంత పార్టీకి దూరమై, లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. మీడియా మేనేజ్ మెంట్ లో చంద్రబాబుని చూసి రఘురామ లాంటి వాళ్లు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.