చేతగాని చంద్రబాబు నిస్సిగ్గుగా చెబుతున్న మాటలివి

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వం పేద ప్రజల్ని అప్పులపాలు చేస్తోంది అంటూ చంద్రబాబు వీర లెవల్లో డైలాగులు పేల్చారు. జగనన్న కాలనీల్లో నిర్మించే ఇళ్లకు అదనంగా 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం…

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వం పేద ప్రజల్ని అప్పులపాలు చేస్తోంది అంటూ చంద్రబాబు వీర లెవల్లో డైలాగులు పేల్చారు. జగనన్న కాలనీల్లో నిర్మించే ఇళ్లకు అదనంగా 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం ఇంటి నిర్మాణానికి 3.8లక్షలు కేటాయించాలన్నారు. పనిలో పనిగా టిడ్కో ఇళ్ల కేటాయింపుపై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు బాబు.

టిడ్కో ఇళ్లు జగన్ ప్రభుత్వం పేదలకు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీస్తున్న చంద్రబాబుకి గతంలో తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం గుర్తు లేదా. ఐదేళ్లపాటు పదవిలో ఉన్న బాబు, అపార్ట్ మెంట్లను ఎందుకు పూర్తి చేయలేకపోయారు. కమీషన్ల మేత మేసి, సగం నిధులతో పనులు మొదలు పెట్టి పేద, మధ్యతరగతి ప్రజల్ని వంచించారు బాబు. 

నిర్మాణాలు పూర్తికాకముందే పెయింట్లు వేసి భ్రమల్లోకి నెట్టేశారు. తీరా ఎన్నికలకు ముందు గృహప్రవేశాలంటూ హడావిడి చేసి మాయ చేయాలనుకున్నారు. ఐదేళ్లలో తాను చేయలేక, చేతగాక వదిలేసిన పనిని జగన్ పూర్తి చేయాలంటూ డిమాండ్ చేసే హక్కు అసలు చంద్రబాబుకి ఎక్కడుంది..?

ఇళ్ల నిర్మాణం గురించి కానీ, ఇళ్ల పట్టాల కేటాయింపు పథకం గురించి కానీ మాట్లాడే అర్హత అసలు చంద్రబాబుకి ఉందా. తన హయాంలో ఒక్క ఇంటి పట్టా అయినా చంద్రబాబు పేదలకు ఇచ్చారా..? తనది కాకపోతే లక్షయినా అడుగుతారు, పది లక్షలయినా అడగాలంటారు బాబు. ప్రస్తుతం పేదల తరపున వకాల్తా పుచ్చుకుని 2 లక్షల రూపాయలు అదనంగా అడుగుతున్న బాబు తాను ఆ పని చేయలేకపోయానని ఒప్పుకున్నట్టే కదా.

తాజాగా టీడీపీ నేతలతో సమావేశమై ప్రజా సమస్యలపై పోరాటం అంటూ హడావిడి చేస్తున్న బాబు.. పదే పదే గతంలో తన తప్పుల్ని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. కొత్త జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తున్న బాబు, అసలు తన హయాంలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయని విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తున్నారు. పోలవరం పునరావాసంపై ప్రశ్నిస్తున్న బాబు, తన హయాంలో ఆ పనులు ముందుకు సాగలేదని నిస్సిగ్గుగా ఒప్పుకున్నట్టే లెక్క.

తన తప్పులన్నిటికీ ఇప్పుడు జగన్ ని బాధ్యుడిగా చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. ఎన్నికల హామీలకు మించి ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న జగన్ సర్కారుపై నిందలు వేయడానికి చంద్రబాబు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. అయితే ఈ తాపత్రయంలో తను చేసిన తప్పుల్ని తానే బయటపెట్టుకుంటున్నారు పాపం.