సీన్ తర్వాత సీన్ కంప్లీట్ చేయడం, దాన్ని మానిటర్ లో చూసుకుని నెక్స్ట్ సీన్ కి మరింత మెరుగైన పెర్ఫామెన్స్ ఇవ్వడం సినిమావాళ్లకు అలవాటే. హీరో కమ్ పొలిటీషియన్ పవన్ కల్యాణ్ కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడంలో సీన్ తర్వాత సీన్ కంప్లీట్ చేస్తున్నారు. అయితే మెరుగైన పర్ఫామెన్స్ సంగతి దేవుడెరుగు, ఒక సీన్ కి ఇంకో సీన్ కి సంబంధం లేకుండా చేసేస్తున్నారు. అదే ఇప్పుడు జనసైనికులకు తలనొప్పిగా మారింది.
ఏదైనా అంశాన్ని తలకెత్తుకోవడం, ముందు ట్వీట్ చేయడం, ఆ తర్వాత ఫొటోలు దిగడం, చల్లగా తప్పుకోవడం పవన్ కు మొదట్నుంచి అలవాటు. ఈసారి కూడా అదే చేశారు. ఆ మధ్య తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం నుంచి సడన్ గా మాయమైపోయిన పవన్ కల్యాణ్ ఇటీవలే జాబ్ క్యాలెండర్ తో ఒక్కసారిగా బయటకొచ్చారు. జాబ్ క్యాలెండర్ పై నిరసన అంటూ మరోసారి పొలిటికల్ స్క్రీన్ పైకొచ్చిన పవన్.. ఒక్కరోజు ముచ్చటతో ఆ అంశాన్ని సరిపెట్టారు.
క్యాడర్ కూడా ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజీలకు వెళ్లి వినతి పత్రాలిచ్చి మమ అనిపించింది. అంతే.. మళ్లీ షరా మామూలే. ఎప్పట్లానే పవన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అట్నుంచి అటు సినిమా సెట్స్ పైకి వచ్చేశారు. సోషల్ మీడియా ఎకౌంట్లలో బక్రీద్ శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు పోస్టులు పడుతూనే ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ అంశం మాత్రం కనుమరుగైపోయింది.
సమస్యలపై పోరుబాట పడితే తాడోపేడో తేల్చుకునేలా ఉండాలి. కానీ పవన్ మాత్రం ఎప్పుడు ఏ అంశంపై ఎవరు తన దగ్గరకొస్తే దాన్ని తాను హైజాక్ చేసి, కొత్తగా కనిపెట్టినట్టు బిల్డప్ ఇస్తారు. జనసేన తరపున దాన్ని హైలెట్ చేయాలనుకుంటారు. అయితే ఇక్కడే పవన్ తో చిక్కొచ్చిపడుతుంది. అలా నెత్తినేసుకున్న అంశాన్ని కనీసం 24గంటలైనా గడవకముందే పక్కన పెట్టేస్తారు.
గతంలో అమరావతి ఉద్యమం అయినా, ఉక్కు సమస్య అయినా.. పవన్ ఇలా టచ్ చేసి అలా వదిలేశారంతే. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా పవన్ అదే ఫార్ములా ఫాలో అయ్యారు. ఒకరోజు నిరసన ప్రదర్శనలతో జనసేన నాయకులు అరెస్ట్ అయి బయటకొచ్చారు, పవన్ ఆ విషయం మరచిపోయారు.
జాబ్ క్యాలెండర్ ముచ్చట పూర్తికాక ముందే రైతులకి గిట్టుబాటు ధరలు దొరకడంలేదని మరో ఉద్యమం మొదలు పెడతానంటున్నారు పవన్. ఇటీవలే దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ ఇచ్చారు. త్వరలో దీనిపై కూడా సింగిల్ అజెండాతో, సింగిల్ డే షో నడిపి వెంటనే పక్కనపడేస్తారు పవన్. అందులో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు.