సీబీఐకి రఘురామ ఉచిత సలహాలు

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి అవకాశం రావాలే కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి కూడా సలహాలివ్వగలరు. ప్రస్తుతం ఆయన సీబీఐకి ఉచిత సలహాలిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల సమాచారం ఇస్తే రూ.5లక్షలు…

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి అవకాశం రావాలే కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి కూడా సలహాలివ్వగలరు. ప్రస్తుతం ఆయన సీబీఐకి ఉచిత సలహాలిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల సమాచారం ఇస్తే రూ.5లక్షలు రివార్డు ఇస్తామంటూ సీబీఐ ప్రకటించిన నేపథ్యంలో రఘురామ, ఆ రివార్డు ఏ మూలకు సరిపోతుందంటూ సెటైర్ పేల్చారు. 

సమాచారం ఇచ్చేవారికి ప్రాణభయం ఉంటుందని, కనీసం కోటి రూపాయలైనా ఇవ్వాలన్నారు. ప్రాణ భయం ఉంటే కోటి రూపాయలిస్తామన్నా ఎవరు సాహసిస్తారు. మరి రఘురామ లాజిక్ ఏంటో.. తెలియడం లేదు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో… కొండంత రాగం తీసిన సీబీఐ నిందితులంటూ చాలామందిని విచారణ పేరుతో పిలిపించింది. సునీల్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించింది. తీరా సునీల్ కుటుంబ సభ్యులంతా తమను అన్యాయంగా ఆ కేసులో ఇరికించారని వాపోయారు. ఆ తర్వాత మరికొంతమందిని విచారణకు పిలిపించారు. హత్యకు వాడిన ఆయుధాలు వెతికించారు. ఫైనల్ గా ఏమీ తేలకపోవడంతో.. చివరకు పేపర్ ప్రకటన ఇచ్చారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల సమాచారం అందిస్తే రూ.5లక్షలు రివార్డు ఇస్తామన్నారు. సీబీఐ విడుదల చేసిన ప్రకటన సంచలనంగా మారింది. కానీ ఎవరూ ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే నోటి దురుసు ఎంపీ రఘురామ మాత్రం ఈ విషయంలో సీబీఐకే సలహాలిస్తున్నారు.

రఘురామపై ట్రోలింగ్..

రఘురామ కృష్ణంరాజు సీబీఐకి సలహాలివ్వడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఇటీవల జగన్ కేసుల విషయంలో రఘురామ ఎంత హడావిడి చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆమధ్య రాష్ట్ర ప్రభుత్వంపై నోరుపారేసుకున్న కేసులో బెయిలు కోసం ఆయన ఎన్ని డ్రామాలాడారో అందరికీ తెలుసు. 

అందుకే ఎంత ఖర్చు పెడితే, ఎవరు నోరు తెరుస్తారో, ఎంత ముట్టజెబితే ఎవరు ఎలాంటి సాక్ష్యం చెబుతారో రఘురామ కంటే బాగా ఇంకెవరికీ తెలియదంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. రఘురామ సలహాపై పంచ్ లు పేలుస్తున్నారు.