అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డిని హీరో రాజశేఖర్ హైదరాబాద్ చార్మినార్ రోడ్డులో కొట్టడం గుర్తుందా? అప్పట్లో ఆ సీన్ బాగా పాపులర్. రామిరెడ్డి చొక్కా చించి, కిందపడేసి కాళ్లతో తన్నుకుంటూ, డ్రాయర్‌తో నడిపిస్తూ… పోలీస్‌స్టేషన్‌కు హీరో తీసుకెళ్తాడు. ఇప్పుడీ సీన్‌ని గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు గుర్తు చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గంటలోపే ఇలాంటి సీన్‌ను ఏపీ ప్రజలకు సినిమా చూపించినట్టుగా చూపుతామని ఆయన ఆవేశంగా ప్రకటించారు. ఇంతకూ ఆయన తంతానంటున్నది ఎవరినో తెలుసా…ఏపీ కేబినెట్‌లో కీలక మంత్రి కొడాలి నానీని.
యరపతినేని శనివారం ఓ సమావేశంలో మాట్లాడుతూ కొడాలిపై రెచ్చిపోయారు. మంత్రిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఒక గంటలోపు కొడాలి నానీని అంకుశం సినిమాలో రామిరెడ్డిని రోడ్డు మీద ఎలాగైతే కొట్టుకుంటూ పోతారో, ఆ విధంగానే తన్నుకుంటూ పోతామని ఆయన బహిరంగంగా హెచ్చరించారు.
తమ వాళ్లను పది రోజులు జైల్లో పెడితే, వైసీపీ వాళ్లను వందరోజులు పెడతామని హెచ్చరించారు. తమ మీద పది కేసులు పెడితే, వైసీపీ నేతలపై వంద కేసులు పెడతామని తీవ్రస్థాయిలో హెచ్చరించడం గమనార్హం. ఇవ్వన్నీ టీడీపీ అధికారంలోకి వస్తే చేసేవని గుర్తించుకోవాలి.
కొడాలి నానీతో పాటు వైసీపీ నేతలపై యరపతినేని ఘాటు హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2018లో మైనింగ్‌కు సంబంధించి యరపతినేనిపై సీబీఐ కేసు నమోదైన సంగతి తెలిసిందే. యరపతినేనిపై జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న దాఖలాలు లేవు. అలాంటిది కొడాలి నానీపై యరపతినేని ఎందుకంతగా విరుచుకుపడ్డారనే చర్చ జరుగుతోంది.
చంద్రబాబు, లోకేశ్ పాలిట కొరకరాని కొయ్యగా మారిన కొడాలిపై టీడీపీ నేతలు ఎంత అక్కసుగా ఉన్నారో యరపతినేని హెచ్చరికలు ప్రతిబింబిస్తున్నాయి. యరపతినేని హెచ్చరికపై కొడాలి నాని కౌంటర్ ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకుంది.