బాబు పాలిట శ‌కుని!

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు మాయ‌లో ప‌డి టీడీపీ త‌న‌కున్న ప‌ర‌ప‌తిని కూడా పోగొట్టుకుంటోంది. ర‌ఘురామ‌కృష్ణం రాజు విష‌యంలో త‌మ పార్టీ ముఖ్యులు చంద్ర‌బాబు, లోకేశ్ త‌దిత‌రులు వ్యూహాత్మ‌క‌ త‌ప్పిదం చేస్తున్నార‌నే అభిప్రాయాలు టీడీపీ శ్రేణులు…

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు మాయ‌లో ప‌డి టీడీపీ త‌న‌కున్న ప‌ర‌ప‌తిని కూడా పోగొట్టుకుంటోంది. ర‌ఘురామ‌కృష్ణం రాజు విష‌యంలో త‌మ పార్టీ ముఖ్యులు చంద్ర‌బాబు, లోకేశ్ త‌దిత‌రులు వ్యూహాత్మ‌క‌ త‌ప్పిదం చేస్తున్నార‌నే అభిప్రాయాలు టీడీపీ శ్రేణులు నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ తిర‌గ‌బ‌డ‌డాన్ని రాజ‌కీయంగా సొమ్ము చేసుకునేందుకు టీడీపీ ప్లాన్ వేసింది.

ఇందులో భాగంగా త‌న అనుకూల మీడియా సంస్థ‌ల వేదిక‌గా వ్య‌వ‌హారాన్ని న‌డపాల‌ని టీడీపీ ప‌క్కా స్కెచ్ వేసింది. అయితే ర‌ఘురామ అరెస్ట్‌, అనంత‌రం సీఐడీ ద‌ర్యాప్తులో సంచ‌ల‌నాలు వెల్ల‌డ‌య్యాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఏ విధంగా కుట్ర‌ప‌న్నారో సుప్రీంకోర్టుకు సీఐడీ స‌మ‌ర్పించిన నివేదిక వివ‌రంగా చెప్పింది. ఇంత జ‌రిగినా చంద్ర‌బాబు రాజ‌గురువు మీడియా సంస్థ‌కు క‌నువిప్పు అయిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. 

చంద్ర‌బాబు పాలిట ఎల్లో మీడియా శ‌కునిలా దాపురించింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ర‌ఘురామ లేఖ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తూ గ‌త కొన్ని నెల‌లుగా ఎల్లో ప‌త్రిక‌లు, చాన‌ళ్లు చెల‌రేగిపోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో సీఐడీ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో ఆర్థిక వ్య‌వ‌హారాలు, ఇత‌ర‌త్రా గుట్టుర‌ట్టు కావ‌డంతో ర‌ఘురామ విషయంలో కొంచెం దూకుడు త‌గ్గించాయి. 

అలాగే ఒక ప‌త్రిక ఆయ‌న వార్త‌ల‌కు గ‌తంలో మాదిరిగా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. చంద్ర బాబు మెప్పు పొంద‌డానికి ఇదే త‌గిన స‌మ‌య‌మ‌ని రాజ‌గురువు ప‌త్రిక ఇటీవ‌ల రెచ్చిపోతోంది. అయితే ర‌ఘురామ మాట‌ల‌కు ఆవ‌గింజంత కూడా విలువ లేని స‌మ‌యంలో స‌ద‌రు ప‌త్రిక నెత్తికెత్తుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ఏడాది క్రితం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ర‌ఘురామ మాట్లాడితే… వైసీపీ శ్రేణులు కూడా ప‌ట్టించుకునేవి. ఇప్పుడు ర‌ఘురామ‌ను త‌మ‌కు వ్య‌తిరేక ప్ర‌జాప్ర‌తినిధిగానే వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చూస్తున్నారు. అందువ‌ల్ల ర‌ఘురామ మాట‌ల‌కు విలువ లేకుండా పోయింది.

ప్ర‌జాభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ర‌ఘురామ మాట్లాడే, రాసే ప్ర‌తి అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తూనే, మ‌రోవైపు అదే మీడియాలో చంద్ర‌బాబు, లోకేశ్ వార్త‌లు ఎక్క‌డున్నాయో వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి నెల‌కుంది. ఇదే టీడీపీ శ్రేణుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ రోజు రాజ‌గురువు ప‌త్రిక తీసుకుందాం. ప్ర‌ధాన సంచిక మూడో పేజీలో ర‌ఘురామ వార్త‌ల‌కు, అలాగే చంద్ర‌బాబు వార్త‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త‌ల‌ను గ‌మ‌నిస్తే…ర‌ఘురామ‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో తామేం కోల్పోతున్నామో టీడీపీ గుర్తించ‌లేద‌నే వాస్త‌వం తెలిసొస్తుంది.

జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా రాసే అంశాల‌కు ర‌ఘురామ రాసే లేఖ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇవ్వ‌డం…న‌ర‌సాపురం ఎంపీకి వ్య‌క్తిగ‌తంగా సంతృప్తి క‌లిగించ‌డ‌మే త‌ప్ప ముఖ్య‌మంత్రికి వ‌చ్చే న‌ష్టం ఏంటి? అలాగే టీడీపీకి ర‌ఘురామ వ‌ల్ల ఏ విధ‌మైన ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో రాజ‌గురువే ఆలోచించుకోవాల్సి ఉంది. 

మొత్తానికి ర‌ఘురామ ట్రాప్‌లో ప‌డి టీడీపీ త‌న‌కున్న కాసింత ప‌రువు కూడా పోగొట్టుకుంటోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికైనా టీడీపీ, ఎల్లో మీడియా మేల్కొంటే బాగుప‌డ‌తాయి. లేదంటే ప‌త‌నాన్ని ఎవ‌రు మాత్రం అడ్డుకోగ‌ల‌రు?