వైసీపీ దురదృష్టమో లేక రఘురామ అదృష్టమో మొత్తానికి ఆ పార్టీ తరపున నరసాపురం ఎంపీ అయ్యారు. ఏకులా వచ్చి వైసీపీ పాలిట మేకులా తయారయ్యారు. ఒకసారి దారుణంగా దూషించిన వ్యక్తిని మళ్లీ పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నందుకు వైసీపీ తగిన మూల్యం చెల్లించుకుంటోంది. రఘురామ ఉదంతం అన్ని రాజకీయ పార్టీలకు ఓ హెచ్చరిక అనే వాళ్లు లేకపోలేదు.
తాజాగా బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై రఘురామ తనవైన అభిప్రాయాలను వెల్లడించారు. బద్వేల్‌లో ప్రతిపక్షం పార్టీ పోటీ చేయక తమ పార్టీకి మెజారిటీ పెరిగిందని రఘురామ వెటకరించారు. అలాగే ఏపీ ప్రభుత్వంపై 81 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారని ఇండియా టుడే సర్వేలో తేలిందని ఆయన చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ పరిస్థితులే ఏపీలోనూ తలెత్తుతాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సొంత పార్టీ తన పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈటల రాజేందర్ తన మంత్రి పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అని తలపడ్డారు.
తన ఆత్మగౌరవానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారానికి మధ్యే పోటీ అనే నినాదంతో జనంలోకి వెళ్లారు. చివరికి తన ఆత్మగౌరవమే గెలిచిందని నిరూపించారు.
వైసీపీ తనతో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఆ పార్టీ వల్ల దక్కిన ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని రఘురామ కృష్ణంరాజుకు అనిపించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈటల రాజేందర్ స్ఫూర్తితో తాను కూడా వైఎస్ జగన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైతే ఎంత బాగుంటుందో కదా అని నెటిజన్లు అంటున్నారు.
ఇంటియా టుడే సర్వేలో ఏపీ ప్రభుత్వంపై 81 శాతం అసంతృప్తిగా ఉన్నట్టు తేలిందని, హుజూరాబాద్ పరిస్థితులే తలెత్తుతాయని తానే అంటున్న నేపథ్యంలో ఇక రాజీనామా చేసేందుకు భయమెందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
రాజీనామాతో తనను ఎన్నుకున్న నరసాపురం ఓటర్ల ఆత్మగౌరవాన్ని కాపాడాలని నెటిజన్లు కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనైనా కనీసం ఒక్కసారి సొంత నియోజకవర్గంలో పర్యటించాలని ఓటు వేసిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏమండోయ్ రఘురామ గారూ… వినిపిస్తోందా సార్!