హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోయింది. అధికార పార్టీ గెలుస్తుందని ఓ దశలో ఈటల వర్గం డీలాపడినా.. అనూహ్యంగా పరిణామాలు మారిపోయాయి. దళితబంధు పనికి రాలేదు, అభివృద్ధి నినాదం ఆదుకోలేదు, ఈటలపై భూకబ్జా ఆరోపణలు పనిచేయలేదు, హరీష్ రావు మంత్రాంగం కూడా నిలబడలేదు. అసలెందుకిలా అని టీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకుంటే.. లెక్కలేనన్ని కారణాలు కళ్లముందే కనబడుతున్నాయి.
ఈటల రాజేందర్, కేవలం హుజూరాబాద్ కే పరిమితమైన పేరు కాదు, తెలంగాణ మొత్తం తెలిసిన వ్యక్తి, ఆ మాటకొస్తే.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈటల పేరు జనాలకి బాగా తెలుసు. అలాంటి వ్యక్తిమీద ఓ బలమైన అభ్యర్థిని నిలబెట్టకపోవడం కేసీఆర్ చేసిన తొలి తప్పు.
గెల్లు శ్రీనివాస్ విద్యార్థి నాయకుడే కావొచ్చు, ఉద్యమ నేపథ్యం ఉండొచ్చు.. కానీ తన సొంత ఊరిలో కూడా ఆయనకు మెజార్టీ రాలేదంటే ఆయన ప్రభావం ఎంతమాత్రమో తెలిసిపోయింది. గెల్లుని అభ్యర్థిగా ప్రకటించేందుకు కూడా కేసీఆర్ చాలా టైమ్ తీసుకున్నారు. దీంతో కొత్త అభ్యర్థితో చేసిన ప్రయోగం తేడా కొట్టింది.
చేరికలతో లాభమేంటి..?
కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పడం, ఎమ్మెల్సీ హామీ ఇవ్వడం కూడా కొంత మైనస్ అయింది. పార్టీ మారిన వారికి అంత ప్రయారిటీ ఇస్తారా.. అదంతా ఈటల రాజేందర్ పై ఉన్న ద్వేషమేనా అని జనం అనుకున్నారు. టీడీపీ నుంచి బీసీ నేత ఎల్.రమణను పార్టీలోకి ఆహ్వానించడం, ఇనుగాల పెద్దిరెడ్డి, కశ్యప్ రెడ్డి వంటి వారికి చోటివ్వడం.. ఇలా చాలానే చేశారు కేసీఆర్.
బీసీలపై ఎక్కడలేని ప్రేమ కురిపించారు. హుజూరాబాద్ కి చెందిన నేతలకు కీలక పదవులిచ్చి మరో స్ట్రాటజీ మొదలు పెట్టారు. కానీ అవేవీ పనిచేయలేదు. కౌశిక్ రెడ్డిని ఓటింగ్ రోజు స్థానికులు తరిమి కొట్టారంటే.. ఆయన చేరిక వల్ల టీఆర్ఎస్ కి ఎంత లాభం చేకూరి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిన ఓట్లు టీఆర్ఎస్ కు పడలేదు, బీజేపీకి షిఫ్ట్ అయ్యాయి.
పథకాలు కలసి రాలేదు..
దళితబంధుతో మొత్తం సీన్ మారిపోతుందనుకున్నారు కేసీఆర్. హుజూరాబాద్ ని మోడల్ గా పెట్టి ఓట్లు రాబట్టుకోవాలనుకున్నారు. కానీ దళితబంధు ప్రకటనతో ఇతర వర్గాల నుంచి డిమాండ్లు మొదలవుతాయని ఊహించలేకపోయారు.
అంతేకాదు ఆ పథకాన్ని ఎన్నికల స్టంట్ గా జనం అర్థం చేసుకున్నారు. మిగతా వర్గాల్లో అసంతృప్తి టీఆర్ఎస్ కు వ్యతిరేకం అయింది.
హరీష్ రావు ప్రభావం లేదు..
ఎన్నికలకు 4 నెలల ముందుగానే హరీష్ రావు, హుజూరాబాద్ లో మకాం వేసి ఆన్ని తానై చూసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ నేతల్ని కలుపుకొని ఆయన ముందుకెళ్లారు. ప్రచారంలో గెల్లు శ్రీనివాస్ వెనకబడ్డా, హరీష్ రావు నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. అయినా కూడా ఫలితం లేదు.
చివర్లో కేసీఆర్ సభకు అనుమతి లేకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్ గా మారిందని చెబుతారు. కేంద్ర బలగాలు మొత్తం రంగంలోకి దిగడం, ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం కాస్త తక్కువగా ఉండటం కూడా టీఆర్ఎస్ ఓటమికి మరో కారణం. అభ్యర్థి ఎవరైనా జనం కేసీఆర్ ని, టీఆర్ఎస్ ని చూసి ఓట్లు వేస్తారనే అధికార పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ హుజూరాబాద్ లో అస్సలు పనిచేయలేదు.