రమేష్ హాస్పిటల్ కే తరలించాలి, వైద్య పరీక్షలు కూడా రమేష్ హాస్పిటల్ లోనే జరగాలి.. ఇవీ కోర్టుల్లో ఎంపీ రఘురామకృష్ణంరాజు న్యాయవాదులు వినిపించిన వాదన. సుప్రీం కోర్టులో కూడా రమేష్ హాస్పిటల్ పేరునే జపించారు రఘురామ తరఫు న్యాయవాదులు.
అరెస్టైన చంద్రబాబు సన్నిహితులకు రమేష్ హాస్పిటల్ స్వర్గధామంగా మారిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన అచ్చెన్నాయుడు తనకు బెయిల్ వచ్చేంత వరకూ కూడా రమేష్ హాస్పిటల్ లోనే సేదతీరారు.
బెయిల్ వచ్చిన మర్నాడే అయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. రమేష్ హాస్పిటల్ కు పంపడం అంటే తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసుకు పంపినట్టే అని రఘురామకృష్ణంరాజు కేసులో ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ పరిస్థితుల్లో రఘురామ కూడా రమేష్ హాస్పిటల్ కే మొదట చేరారు. ఆయనకు వైద్య పరీక్షలు అక్కడే చేసి, అక్కడ నుంచినే ఆ హాస్పిటల్ వైద్యుల నివేదిక ఆధారంగానే రఘురామపై పోలీసుల దాడి జరిగిందా, లేదా అనే విషయాలపై నిర్ధారించాలనేంత రేంజ్ లో ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే సుప్రీంకోర్టు వారి వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. రమేష్ హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ మిలటరీ హాస్పిటల్ కు రఘురామకృష్ణంరాజును తరలించారు.
హాస్పిటల్ లో చేరాలన్న రఘురామ కోరిక నెరవేరిందేమో కానీ, మిలటరీ హాస్పిటల్ కచ్చితంగా రమేష్ హాస్పిటల్ తరహాలో ఉండదు! టీడీపీ హెడ్ ఆఫీస్ అయితే కాదు. హాస్పిటల్ లో ఉన్న రఘురామకృష్ణంరాజును పరామర్శిస్తామంటూ ఆయన కుటుంబీకులు ప్రయత్నించినా, ఆసుపత్రి వర్గాలు ఒప్పుకోలేదట.
అదే రఘురామ న్యాయవాదులు కోరిన హాస్పిటల్ అయ్యుంటే.. ప్రైవేట్ హాస్పిటల్ లో లోపల ఏం జరుగుతుందో మూడో కంటికి తెలిసే అవకాశాలు ఉండవు. ఏదేమైనా..కోరుకున్న రమేష్ హాస్పిటల్ సేవలు మిస్ అయ్యి, మిలటరీ ఆసుపత్రిలో సేదతీరుతున్నట్టున్నారు రఘురామకృష్ణంరాజు.