ర‌ఘురామ‌కు అదొక్క‌టీ త‌ప్ప‌… అన్నీ తెలుస్తాయ్‌!

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు చాలా విద్య‌లు తెలుసు. దివంగ‌త పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్రస్వామి త‌ర్వాత కాల‌జ్ఞానం తెలిసిన వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారంటే…ఆ ఒక్క‌డూ ర‌ఘురామ‌కృష్ణంరాజే. ఢిల్లీలో చెట్టుకింద కూచుని య‌జ్ఞ‌యాగాదులు చేసి అమూల్య‌మైన విద్యల‌ను వ‌రంగా…

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు చాలా విద్య‌లు తెలుసు. దివంగ‌త పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్రస్వామి త‌ర్వాత కాల‌జ్ఞానం తెలిసిన వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారంటే…ఆ ఒక్క‌డూ ర‌ఘురామ‌కృష్ణంరాజే. ఢిల్లీలో చెట్టుకింద కూచుని య‌జ్ఞ‌యాగాదులు చేసి అమూల్య‌మైన విద్యల‌ను వ‌రంగా పొందారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎంతైనా రాజుగారు క‌దా ఆయ‌న‌. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. ప్ర‌ధాని మోడీ, కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో ఆయ‌న భేటీ కానున్నారు.

ముఖ్య‌మంత్రి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ర‌ఘురామ‌కృష్ణంరాజు ముంద‌స్తు పూర్తి వివ‌రాలు చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.  వీరబ్ర‌హ్మేంద్ర‌స్వామి మ‌ల్లే ఆయ‌న‌కు కాలాన్ని ముందుగా ద‌ర్శించే గొప్ప విద్య అల‌వ‌డిన‌ట్టు ఇప్పుడిప్పుడే జ‌నానికి తెలిసొ స్తోంది. ప్ర‌ధానితో భేటీ త‌ర్వాత జ‌గ‌న్ ఏం చెబుతారో…ముందుగానే ర‌ఘురామ ఊహించ‌డం ఆయ‌న ముందు చూపున‌కు నిద‌ర్శ‌నం. త‌న విష‌యంతో పాటు బెయిల్ అంశంపై ప్ర‌ధాని, కేంద్ర‌హోంమంత్రితో చ‌ర్చించేందుకు జ‌గ‌న్ వ‌చ్చార‌ని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌పై ర‌ఘురామ‌రాజు ఏమన్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

‘ప్రధానిని కలుస్తానని సీఎం జగన్ ఢిల్లీ వస్తున్నారు. ప్రధానితో ఫలవంతంగా ముగిశాయని చెబుతారు. ప్రత్యేక హోదాపై చర్చించామంటారు. మోడీతో 20నిమిషాలు భేటీ అయితే బయట వేచి ఉన్న సమయంలో కలిపి గంట చర్చించామంటారు’ అని రఘురామ త‌న మార్క్ వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. ర‌ఘురామ చెప్పేవ‌న్నీ బాగున్నాయి. కానీ ఆయ‌న‌కు అదొక్క‌టి మాత్రం ఎందుకు తెలియ‌లేదో ఇప్ప‌టికీ అర్థం కాని సంగ‌తి.

ఏపీ సీఐడీ అధికారులు హైద‌రాబాద్ వ‌చ్చి త‌న‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తార‌ని కాల‌జ్ఞాని ర‌ఘురామ‌కు ఎందుకు తెలియ‌లేదు? అలాగే విజ‌య‌వాడ‌కు తీసుకెళ్లి చిత‌క్కొడుతార‌ని ఆయ‌న ముందుగానే ఎందుకు ప‌సిగ‌ట్ట‌లేక‌పోయారు. ఈ రాత్రికి గ‌డిస్తే చాలురా భ‌గ‌వంతుడా అనే దుస్థితి నేటి కాల‌పు కాల‌జ్ఞానికి ఎందుకొచ్చిందనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. 

బ‌హుశా త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా జ‌ర‌గ‌బోయేవి త‌ప్ప, ఎదుటి వాళ్ల‌వ‌న్నీ క‌నుక్కొనే వ‌రం ఏదైనా ఆయ‌న‌కు ప్ర‌సాదించి వుండాలి. ఇదే నిజ‌మై వుంటుంది. త‌న వెకిలి చేష్ట‌లు రానున్న రోజుల్లో ఎలాంటి ఉప‌ద్ర‌వం తీసుకొస్తాయో తెలుసుకునే వ‌రాన్ని ఆయ‌న‌కు ప్ర‌సాదించాల‌ని ర‌ఘురామ శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.