పాన్ ఇండియా ఇమేజ్ వస్తే వంద కోట్ల పారితోషికం వస్తుంది. కానీ దాని కోసం చూసుకుంటే ఎన్టీఆర్ కు నాలుగేళ్ల కాలం హుష్ కాకి అయిపోయింది. కనీసం ఈ టైమ్ లో ఆరు సినిమాలు చేసినా 200 కోట్ల పారితోషికం వచ్చి వుండేది. పైగా ఆ ఆరు సినిమాల్లో ఏ రెండు బ్లాక్ బస్టర్ అయినా ఇది మరి కాస్త ఎక్కువే అయి వుండేది.
35 కోట్ల పారితోషికంతో ఆర్ఆర్ఆర్ చేసేందుకు ఓకె అన్నారు ఎన్టీఆర్ అని టాక్. దానికి కారణం రాజమౌళి పాన్ ఇండియా ఇమేజ్. అలా వేచి వున్నారు కనుకే ప్రభాస్ ఈ రోజు నూరు నుంచి నూట యాభై కోట్లు పారితోషికం అందుకుంటున్నారు. బహుశా ఇదే కారణంతో ఎన్టీఆర్ ఓపిగ్గా వుండి వుండొచ్చు.
కానీ ఆ పాన్ ఇండియా ఇమేజ్ ఏమేరకు వస్తుంది అన్నది చూడాలి. ఎందుకంటే బాహుబలి తో ప్రభాస్ రెమ్యూనిరేషన్ వంద కోట్లకు వెళ్లిపోతే, అతనితో సమానంగా నటించిన రానా రెమ్యూనిరేషన్ ఇంకా అయిదు కోట్ల దగ్గరే వుంది. అనుష్క అయితే ఫేడవుట్ అయిపోయింది. తమన్నా సంగతి సరేసరి. ఏ పాన్ ఇండియా ఇమేజ్ లేకుండానే మహేష్ బాబు, పవన్ లాంటి వాళ్లు యాభై కోట్ల రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారు.
పైగా ఆర్ఆర్ఆర్ సినిమాతో తన ఇమేజ్ ఏమేరకు పెరగుతుందో, ఎటు టర్న్ తీసుకుంటుందో అన్నది ఓ క్లారిటీ లేదు. అందుకోసమే ఆర్ఆర్ఆర్ తరువాత చేయబోయే సినిమా ఎలా వుండాలి అన్నది ఫిక్స్ చేసుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే త్రివిక్రమ్ తో సినిమా వదులుకున్నారు.
ఆర్ఆర్ఆర్ లో చేస్తూనే రామ్ చరణ్ హ్యాపీగా ఆచార్య సినిమా చేసేసారు. శంకర్ సినిమా స్టార్ట్ చేసేసారు. అతనికి అలా పాన్ ఇండియా సినిమా ట్రయ్ చేయకుండానే దొరికేసింది. ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ సినిమా చేయాలి. దాన్నే పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లాలి. అది ఏ మేరకు సాధ్యం అవతుందో చూడాలి.