ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ప్రభుత్వాలు ఆంక్షలు ప్రకటించడం మాటెలా ఉన్నా.. ప్రజలే భయపడి థియేటర్ల వైపు తొంగి చూడటం లేదు పూర్తి స్థాయిలో! ఓ మోస్తరు స్థాయిలో మాత్రమే థియేటర్ల వైపు ప్రజల ఆసక్తి కనిపిస్తూ ఉంది.
ఇలాంటి పరిస్థితుల మధ్యన వరల్డ్ వైడ్ విడుదల అయిన.. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఏకంగా పది వేల కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందట! సోనీ పిక్చర్స్ ఇండియా ఈ మేరకు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ లేటెస్ట్ వెంచర్ వసూళ్లు 10,200 కోట్ల రూపాయలు అని ఆ సంస్థ చెబుతోంది.
ఇండియాలో అయితే ఈ సినిమాకు రెండు వందల అరవై కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయట! మార్వెల్ స్టూడియోస్ ఇలా మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుందట. 2021 సంవత్సరానికి ప్రపంచంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే అని దీని రూపకర్తలు ప్రకటించుకుంటున్నారు.
మరి కరోనా భయాల నేపథ్యంలోనే ఈ సినిమా పది వేల కోట్ల రూపాయల స్థాయి వసూళ్లను సాధించిందంటే, పూర్తి స్థాయిలో ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీసే వాతావరణం ఉండి ఉంటే.. పీటర్ పార్కర్ విన్యాసాలు ఇంకా ఏ స్థాయిలో ఉండేవో!