తండ్రి విగ్రహాన్ని వైసీపీ యువనాయకుడు సుత్తితో కొట్టడంపై ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. తండ్రిపై ఆ మాత్రం ప్రేమ ఉన్నందుకు ఆయన్ను అభినందించాల్సిందే. అయితే తండ్రిని సీఎం పదవి నుంచి లాగి పడేసినప్పుడు, అలాగే వైశ్రాయ్ హోటల్ ఎదుట చెప్పులేసినప్పుడు ఎన్టీఆర్ కుమారుడు, కుమార్తెలు ఎక్కడున్నారనే నిలదీతలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని దుర్గిలో బస్టాండ్ సమీపంలో ఆదివారం సాయంత్రం దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. ఈ దారుణానికి జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వరరావు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ కూడా చేశారు.
ఈ ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు సహజంగానే టీడీపీ యాక్టీవ్‌గా స్పందించింది. దుందుడుకు స్వభావం ఉన్న నేతలను ప్రోత్సహించినందుకు వైసీపీ తగిన మూల్యం చెల్లించుకుంటోంది. ఇదిలా వుండగా ఈ ఘటనపై ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
‘ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం తెలుగు జాతిని అవమానించినట్లే. దుండగులను వెంటనే అరెస్టు చేయాలి. ఎన్టీఆర్ విగ్రహంపై చేయి వేస్తే తెలుగుజాతి ఊరుకోదు’ అని ఎన్టీఆర్ తనయుడు హెచ్చరించారు. మరి సొంతవాళ్లే తన తండ్రిని అధికార పీఠం నుంచి కూలదోస్తున్నప్పుడు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలకు ఎందుకీ పౌరుషం లేకపోయిందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే వైశ్రాయ్ హోటల్లో తిష్టవేసి చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెరలేపారని తెలిసి…అక్కడికి వెళ్లిన తన తండ్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడైన ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరేసినప్పుడు…ఆయన రక్తం పంచుకు పుట్టిన ఏ ఒక్క బిడ్డకు తిరగబడాలనే స్పృహ కలగలేదా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
తండ్రి పేరు చెప్పుకునే పబ్బం గడుపుకోవడమే తప్ప, ఆయనకు కష్టం వచ్చినప్పుడు …ఇంత మంది పిల్లలు ఉండీ, అనాథలా తీవ్ర అసంతృప్తి, నిర్వేదంతో జీవన ప్రస్థానాన్ని ముగించాల్సి వచ్చిందని ఎన్టీఆర్ స్నేహితులు ఆవేదనతో నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. నాడు నిలువెత్తు మనిషినే నడిబజారులో అవమానించిన వాళ్లంతా, నేడు ఆయన విగ్రహానికి ఏదో జరిగిపోయిందని ఆవేశంతో ఊగిపోవడం ఎంతో విచిత్రంగా ఉందని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.