దేశంలో ఈ రోజుకు అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ బీజేపీలా వ్యవహరించలేదు. ఇది పొగడ్త అనుకుంటే పొరపాటే. నిజానికి ఇది పచ్చి విమర్శ. బీజేపీ తానుగా తేడా పార్టీ అని చెప్పుకుంటూనే చాలా తేడాగా దేశ ప్రయోజనాల విషయంలో వ్యవహరిస్తోంది అన్నది కార్మిక సంఘాల అతి పెద్ద విమర్శ.
బీజేపీలా ఏ ఒక్క పార్టీ దేశాన్ని, దేశ సంపదను ఇప్పటిదాకా తాకట్టుపెట్టలేదని అఖిల భారత సీఐటీయూ అధ్యక్షురాలు హేమలత ఘాటైన విమర్శే చేశారు. పోర్టులు, ఎయిర్ పొర్టులు, రైవేలు, కోల్, స్టీల్ ఒకటేమిటి అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని బీజేపీ మీద ఆమె మండిపడుతున్నారు.
ఏడున్నర పదుల స్వాతంత్రంలో దేశం అనేక రకాలైన సంపదలను సాధించుకుంది. వాటిని నిలబెట్టుకుని భావితరాలకు అందించాల్సిన తరుణంలో ఉన్న వాటిని అన్నీ ప్రైవేట్ పరం చేయడం, నిర్వీర్యం చేయడంలో మోడీ ప్రభుత్వం బిజీగా ఉందని ఆమె హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
మోడీ ఏడేళ్ళ పాలన తరువాత విశ్లేషించుకుంటే ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్ వారి ఆధీనంలోకి వెళ్లిపోతోంది అని హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులు, కార్మిక హక్కులు అన్నీ కూడా ఒక్క దెబ్బకు ఎగిరిపోతున్నాయన్ అన్నారు.
ఎన్నో పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్రం కూడా ప్రజలు కోల్పోవడానికి అట్టే సమయం పట్టబోదు అంటూ హేమలత చేస్తున్న హెచ్చరికలు ఆలోచించేవిగానే ఉన్నాయి మరి. వారూ వీరూ అని కాకుండా అంతా కలసి కేంద్రం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల మీద పోరు చేయాలని ఫిబ్రవరి 23, 24 తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆమె పిలుపు ఇస్తున్నారు.
మొత్తానికి చూస్తే మోడీ పాలనలో సంపద అన్నది పూర్తిగా కరిగి తరిగి పరాయి ప్రైవేటు పాలు అయిపోతోంది అని కార్మిక లోకం పెడుతున్న పెడబొబ్బలు ఏలికలకు వినిపిస్తున్నాయా…వినిపిస్తే వారు పునరాలోచిస్తారా.. చూడాలి మరి.