వంగవీటి రాధా వ్యాఖ్యల దుమారం కొనసాగుతూనే ఉంది. తనపై రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. రాధాపై ప్రేమ కంటే ఆయన కులం ఓట్లను దక్కించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమకిష్టమైన రీతిలో డ్రామాకు తెరలేపాయి.
ఇందులో ఎవరికీ ఎవరూ తక్కువ కాకుండా తమతమ పాత్రలను విజయవంతంగా పోషిస్తున్నారు. ఇందులో రాధా కూడా తక్కువేం తినలేదు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఇంటికి రప్పించుకుని నాటకాన్ని మరింతగా రక్తి కట్టించారనే విమర్శలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గం సొంత పార్టీగా భావించే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ తనదైన రీతిలో రాధా రెక్కీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. వంగవీటి రాధాపై రెక్కీ వ్యవహారంలో ఖచ్చితంగా వైసీపీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. రాధాకు చరిష్మా ఉన్నందునే కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఆయన మద్దతు కోసం తహతహలాడుతున్నారని పోతిన పేర్కొనడం గమనార్హం. రాధాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ ఉందని తెలిపారు.
మంత్రి వెల్లంపల్లితో రాధాకృష్ణను వైసీపీ పెద్దలు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. వెల్లంపల్లి ది అన్నం పెట్టే చేతినే కొరుక్కుతినే సంస్కృతి అని ఘాటు విమర్శలు చేశారు. వెల్లంపల్లి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని పోతిన హెచ్చరించడాన్ని గమనించొచ్చు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే కారణాలతో కేసును నీరిగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
వంగవీటి రాధాకు చరిష్మా ఉందన్న పోతిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అందుకే కాబోలు వైసీపీ, టీడీపీ ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వలేదని దెప్పి పొడిచారు. రాధాపై అంత ప్రేమే వుంటే తమ పార్టీలో చేర్చుకొని పవన్‌కల్యాణ్ టికెట్ ఇవ్వొచ్చు కదా? అని నెటిజన్లు హితవు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు కావడం వల్లే ఇంత వరకూ ఒక్కసారంటే ఒక్కసారే రాధా గెలుపొందారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇంతకూ టీడీపీతో పొత్తులో భాగంగా విజయవాడ నుంచి ఎమ్మెల్యే కావాలనే ఆశే తమరితో ఈ విమర్శలు చేయిస్తోందా…మహేశా అంటూ పోతినపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.