జేబులు గుల్ల చేసుకోవ‌ద్దు!

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఇవాళ ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు వ్యాక్సినేష‌న్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైద్యం కోసం ప్రైవేట్…

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఇవాళ ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు వ్యాక్సినేష‌న్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవ‌ద్ద‌ని ఆయ‌న సూచించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. 

కోవిడ్ వైద్యానికి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులే ముద్దు అని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని బంజారాహిల్స్ పీహెచ్‌సీలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మంత్రి హ‌రీష్‌రావు ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ కోవాగ్జిన్ టీకా వేస్తామ‌న్నారు.

తల్లిదండ్రులంతా పిల్లలకు విధిగా వ్యాక్సిన్ వేయించాల‌ని ఆయ‌న సూచించారు. పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించే బాధ్యత తల్లిదండ్రులదే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అలాగే కళాశాలల యాజమాన్యాలూ బాధ్యత తీసుకోవాల‌ని కోరారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ పిల్లలకు టీకా ఇచ్చేందుకు అనుమతి ఉంద‌న్నారు. 12 కార్పొరేషన్‌లలో ఆన్‌లైన్, ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్ధతిలో టీకాలు ఇస్తున్న‌ట్టు మంత్రి తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు, సదుపాయాలు ఉన్నాయ‌న్నారు.  21 లక్షల హోమ్ ఐసోలేషన్‌ కిట్లు అందుబా టులో ఉన్న‌ట్టు మంత్రి చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్ద‌ని ఆయ‌న సూచించారు. అలాగే కోవిడ్‌ టీకాలపై  అపోహలు అవసరం లేద‌న్నారు. వ్యాక్సిన్‌ తీసుకుంటే ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చ‌న్నారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయ‌ని మంత్రి తెలిపారు.

గ‌తంలో ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో కూడా రోగుల‌కు త‌గ్గ‌ట్టు వైద్య స‌దుపాయాలు లేని విష‌యం తెలిసిందే. తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాల నుంచి కూడా క‌రోనా ట్రీట్‌మెంట్ కోసం హైద‌రాబాద్‌కు వెళ్లేవాళ్లు. అప్ప‌ట్లో డ‌బ్బు ఇచ్చినా వైద్యం అందించేందుకు త‌గిన వ‌స‌తులు క‌ల్పించ‌లేని ప‌రిస్థితుల్లో…ఇత‌ర రాష్ట్రాల నుంచి హైద‌రాబాద్‌కు నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. 

బ‌హుశా ఆ అనుభ‌వాల నుంచి గుణ‌పాఠాలు నేర్చుకుని ఈ ద‌ఫా ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అన్నీ సిద్ధం చేసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది.