ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విస్తరణపై, ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీకి గుబులు రేకెత్తించేవే. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు అంటూ వైఎస్సార్టీపీ పేరుతో వైఎస్ షర్మిల నూతన రాజకీయ పార్టీని నెలకొల్పిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కొంత కాలంగా ఆమె తెలంగాణలో పాదయాత్ర కూడా చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా తన పార్టీని విస్తరిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఆమె సోమవారం చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్‌లో తన మనసులో మాటను బయట పెట్టారు. ఏపీలో పార్టీ విస్తరిస్తారనే ప్రచారంపై ఏమంటారని మీడియా ప్రతినిధులు షర్మిలను ప్రశ్నించారు. షర్మిల స్పందిస్తూ…రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చన్నారు. పార్టీ పెట్ట కూడదని రూల్ ఏమైనా ఉందా? అని ఎదురు ప్రశ్నించారు.
తన అన్న, ఏపీ సీఎం జగన్‌తో షర్మిలకు విభేదాలున్నాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్నను గిచ్చేందుకే ఏపీలో పార్టీ విస్తరణపై షర్మిల నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో విస్తరించాల్సిన అవసరం ఏముందని, అక్కడ తన సోదరుడు రాజన్న రాజ్యం తీసుకొచ్చారనో, తెస్తారనో మాట ఆమె నోట రాకపోవడం వైసీపీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తెలంగాణలో షర్మిల పార్టీకి జనం నుంచి ఆశించనంతగా ఆదరణ లభించలేదని, ఆంధ్రాలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉండొచ్చనే అభిప్రాయాలు ఒక వర్గం మీడియా నుంచి ఇటీవల వ్యూహాత్మకంగా పెరుగుతున్నాయి. ఆ ట్రాప్‌లో షర్మిల పడి, ఆంధ్రాలో ప్రయోగం చేసేందుకు మొగ్గు చూపుతారా? అనే అనుమానాలకు…ఆమె తాజా వ్యాఖ్యలు బలం కలిగిస్తున్నాయి.