ప్రధానమంత్రి నరేంద్రమోడీ భావోద్వేగాల రాజకీయాలు చేస్తారు తప్ప ప్రజలకు అవసరమైన అంశాల గురించి మాట్లాడరని కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోస్తోంది. చైనా వస్తు బహిష్కరణ పేరిట మోడీ ఇలాంటి సమయంలో మాట్లాడటం ఏమిటని, ఇప్పటికిప్పుడు దేశానికి వేరే సమస్యలు ఉన్నాయనే విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది. చైనా టాయ్స్ కు ప్రత్యామ్నాయంగా భారతీయులు బొమ్మలను తయారు చేసుకోవాలని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాపిక్ పై రాహుల్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా టాయ్స్ మార్కెట్ లో భారతీయులు కొనే మార్కెట్ విలువ చాలా చాలా తక్కువ అని రాహుల్ ప్రస్తావించారు.
ఏడు లక్షల కోట్ల రూపాయల టాయ్స్ మార్కెట్ లో భారత్ విలువ అత్యల్పం అని, దానికి మాట్లాడే బదులు ఇప్పుడు మోడీ విద్యార్థుల భవితవ్యం గురించి మాట్లాడి ఉంటే బావుండేదని రాహుల్ కౌంటరిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తోంది. మోడీ ఈ అంశం గురించి మాట్లాడాల్సిందని రాహుల్ వ్యాఖ్యానించారు.
కోవిడ్-19 వేళ విద్యార్థుల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ పరీక్షల నిర్వహణ ఏమిటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఆరో తేదీ మధ్యన జేఈఈ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ 13న నీట్ జరగనుంది.
అయితే ఇప్పటి వరకూ రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు కదులుతున్నా.. వాటి శాతం తక్కువే. 50 శాతం స్థాయిలో ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. ఇక రైళ్ల సంగతి సరేసరి. ఇలాంటి సమయంలో పరీక్షలు రాయడానికి దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అనేది కూడా పెద్ద సందేహమే!
ఇలాంటి పరీక్షలు రాయడానికి జిల్లా హెడ్ క్వార్టర్ స్థాయి, ఆ పై స్థాయి నగరాలకు విద్యార్థులు ప్రయాణించాల్సి ఉంటుంది. కోవిడ్ సంగతెలా ఉన్నా.. రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం గురించి దృష్టిలో పెట్టుకోకుండా ఈ పరీక్షల నిర్వహణపై పలువురు తప్పుపడుతున్నారు.