అవుట్ డోర్ షూటింగ్ అయితే తప్ప సినిమా యూనిట్ అందరూ రోజూ ఇంటికెళ్లిపోతుంటారు. కానీ కరోనా కాలంలో ఆ తరహా సౌలభ్యం సినిమా వాళ్లకు కొన్నాళ్ల పాటు దక్కదు. సినిమా షూటింగ్స్ ఒక్కొక్కటీ మొదలవుతోన్న నేపథ్యంలో నిర్మాతలు కాస్త ఖర్చయినా ఫర్వాలేదని కొన్ని ఖరీదయిన చర్యలు చేపడుతున్నారు.
షూటింగ్ మొదలయ్యే ముందే యూనిట్‌లో వుండే అందరికీ కోవిడ్ టెస్టులు చేస్తారు. ఒక్కసారి సెట్లోకి వెళ్లిన తర్వాత ఆ షెడ్యూల్ పూర్తయ్యే వరకు ఎవరూ ఇంటికి వెళ్లడానికి వుండదు. అన్ని రోజుల పాటు వారికి వసతి సౌకర్యాలను కూడా నిర్మాతే భరిస్తారు. ‘బిగ్‌బాస్’ లాంటి షోస్‌కి ఈ పద్ధతి ఫాలో అవడంతో సినిమా వాళ్లు కూడా దానిని అప్లయ్ చేస్తున్నారు.
భారీ షెడ్యూల్స్ పెట్టుకోకుండా పది, పదిహేను రోజుల షూటింగ్స్ పెట్టుకుని షూటింగ్ పూర్తి చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. దీని వలన సగానికి పైగా షూటింగ్ చేసుకున్న సినిమాలకు మరింత కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి తప్పుతుంది. అలాగే ఒక ఇరవై, ముప్పయ్ రోజుల వర్క్ బ్యాలెన్స్ వున్న సినిమాలను పూర్తి చేసుకుని థియేటర్లు తెరవగానే విడుదల చేసే వీలు చిక్కుతుంది.