గత ఏడాది ఫిబ్రవరి 14న కశ్మీర్ లో తిరిగి విధుల్లోకి చేరుతున్న భారత సైన్యం పై పుల్వామా వద్ద ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఏకంగా 40 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పెను సంచలనం రేపింది ఆ సంఘటన. పాక్ సంబంధ ముష్కరులే ఆ పని చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే పుల్వామా అటాక్ లో పాక్ పాత్ర ఉందని భారత్ ఆరోపించింది.
గత ఏడాది సరిగ్గా ఈ సమయం నుంచినే కశ్మీర్ లో పెట్రేగిన ఉద్రిక్తత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. పుల్వామా అటాక్ కు ప్రతీకారంగా భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టడం, ఆ సందర్భంగా ఒక విమానం పాక్ ఉపరితంలో కూలి అభినందన్ పట్టుబడటం, తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితుల మధ్యన అతడు విడుదల కావడం.. ఇవన్నీ నాటకీయతను సంతరించుకున్నాయి. సరిగ్గా ఆ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలోనే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది.
అప్పుడు రేగిన తీవ్ర జాతీయ వాదం బీజేపీకి మేలు చేసిందనే అభిప్రాయాలున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి భారీగా సీట్లు లభించడం వెనుక పుల్వామా అనంతర పరిణామాలే కారణం అనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆ సంఘటన జరిగి ఏడాది అయిన నేపథ్యంలో.. రాహుల్ గాంధీ స్పందించారు. పుల్వామా ఘటనపై కేంద్రం ఏం తేల్చిందని ఆయన ప్రశ్నించారు.
ఆ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. పుల్వామా ఘటన వల్ల ఎవరు లబ్ధి పొందారు? అంటూ రాహుల్ ప్రశ్నించారు. పరోక్షంగా బీజేపీ ప్రయోజనం పొందిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే ఆ ఘటనకు బీజేపీ బాధ్యత వహించదా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు పుల్వామా ఘటనలో బలైన భారత సైనికులకు నివాళి ఘటిస్తూ రాహుల్ ఈ ప్రశ్నలు వేశారు.