గత రెండు దశాబ్దాలుగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడు, వచ్చేస్తున్నాడు, వచ్చేశాడు.. అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడో 'పడయప్పా' సినిమాలోనే తన పొలిటికల్ ఎంట్రీ గురించి రజనీకాంత్ వేలు పైకెత్తి చూపించాడు.
అప్పటి నుంచి పై నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ అని రజనీ సినిమాల్లో చెబుతూ వచ్చారు. 'దేవుడు ఆదేసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు..' అనే డైలాగ్ రజనీకాంత్ రాజకీయాల విషయంలో కూడా వినిపిస్తూ వచ్చింది.
గత రెండేళ్లలో రజనీకాంత్ రాజకీయానికి సంబంధించి వార్తలు మరింత ముమ్మరంగా వచ్చాయి. పార్టీ ఏర్పాటు చేసినట్టే అన్నారు. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదనేది తాజా అప్ డేట్. వయసు, ఆరోగ్య రీత్యా ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి రజనీకే ఆసక్తి లేదనే వార్తలు వస్తున్నాయి.
తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎన్నికల ప్రచారం వంటి పనులు పెట్టుకోవద్దని వైద్యులు తనకు చెప్పారని స్వయంగా రజనీకాంత్ ప్రకటించేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆ ప్రకటనతో రాజకీయ వార్తల నుంచి ఆయన తప్పుకుంటున్నట్టే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే సినిమా హీరోల రాజకీయం గురించి వారి అభిమానులు చేసే హడావుడి అంతా ఇంత కాదు కదా, ఈ నేపథ్యంలో రజనీ అభిమానులు కూడా రచ్చ చేస్తూ ఉన్నారు. రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ వారు పట్టుబడుతున్నారట.
చెన్నైలోని రజనీ ఇంటి వద్ద వారి హడావుడి ఉన్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా రజనీకాంత్ అభిమాన సంఘాల వాళ్లు ఈ విషయంలో స్పందిస్తున్నారట. వీరి ఆందోళనలతో రజనీకాంత్ మనసు మార్చుకున్నారని, అభిమానుల కోరిక మేరకు ఆయన రాజకీయాల్లోకి వస్తారంటూ కొత్త పుకార్లు కూడా మొదలయ్యాయి!
రాజకీయాల పట్ల రజనీకాంత్ అనాసక్తి అనేక రకాలుగా బయటపడుతూనే ఉంది. అన్నింటికీ మించి వయసు, ఆరోగ్యం ఆయనకు ఈ విషయంలో సహకారం ఇచ్చేలా లేవు. గతంలో కరుణానిధి, జయలలిత వంటి మదగజాలు రంగంలో ఉండటంతో రజనీ ముందుకు వచ్చినట్టుగా లేరు. ఇప్పుడు వారు లేకపోయినా.. రజనీకి అంత ఆసక్తి ఉన్నట్టుగా లేదు.
అభిమానులకు మాత్రం రెండున్నర దశాబ్దాలుగా రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎదురుచూపులు తప్పుతున్నట్టుగా లేవు!