స్టేడియంలలో అభిమానులకు అవకాశం లేకపోయినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత ఆసక్తిదాయకంగా సాగుతూ ఉంది. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది ఐపీఎల్ లో అన్ని జట్లూ కాస్త సమస్థాయిలోనే రాణిస్తున్నాయి! పూర్తిగా ఫ్లాప్ అవుతున్న జట్లూ లేవు,
వరస విజయాలూ సాధ్యం కావడం లేదు. ఏ మ్యాచ్ లో ఎవరు నెగ్గుతారనేది ముందస్తు అంచనాలకు అందకుండా సాగుతూ ఉంది. ఈ క్రమంలో లీగ్ మ్యాచ్ లు దాదాపు పూర్తవుతున్న దశలో ఇప్పటి కే ప్లే ఆఫ్స్ లో స్థానం ఖరారు చేసుకున్న ఏకైక జట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే. ఎనిమిది విజయాలతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ లో ఒక బెర్త్ ను ఖరారు చేసుకుంది.
ఇక మిగిలిన మూడు బెర్తుల కోసం బెంగళూరు, ఢిల్లీ, రాజస్తాన్, హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. కోల్ కతా, చెన్నై జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు లేనట్టే.
బెంగళూరు, ఢిల్లీ జట్లు ఇప్పటికే చెరో ఏడు మ్యాచ్ లలో విజయం సాధించాయి. ప్రస్తుత సమీకరణాల్లో ఎనిమిది మ్యాచ్ లు నెగ్గిన జట్టు ఏదైనా ప్లే ఆఫ్ కు చేరినట్టే. దీంతో బెంగళూరు, ఢిల్లీ జట్లకు ఇంకా చెరో రెండు అవకాశాలున్నాయి. వాటిల్లో ఒక్కో మ్యాచ్ లో నెగ్గినా ఈ జట్లు ప్లే ఆఫ్ దశకు చేరతాయి.
ఇక రాజస్తాన్, పంజాబ్ జట్లు ఇప్పటికే ఆరారు మ్యాచ్ లలో విజయం సాధించాయి. వీటికి ఉన్న అవకాశాలు కాస్త తక్కువే. మిగిలిన ఒక్క మ్యాచ్ లలో ఇవి కచ్చితంగా విజయం సాధించినా.. మొత్తం విజయాల సంఖ్య ఏడుకు చేరుతుంది. వీటి నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా లేదు. మైనస్ ల స్థాయిలోనే ఉండటం వీటికి అంత సానుకూలాంశం కాదు.
ఇక ఈ సీజన్ లో పడుతూ లేస్తూ సాగుతోంది హైదరాబాద్ జట్టు గమనం. ఒక్కోసారి సులువుగా నెగ్గడం, సులువుగా నెగ్గాల్సిన మ్యాచ్ లలో ఓడటం హైదారాబాద్ శైలిగా మారింది. నెట్ రన్ రేట్ సానుకూలంగా ఉండటం సానుకూలాంశం.
తన తదుపరి రెండు మ్యాచ్ లలోనూ నెగ్గితే హైదరాబాద్ కు అవకాశాలు ఉన్నట్టే. బెంగళూరు, ముంబై జట్లతో హైదరాబాద్ తలపడాల్సి ఉంది. ఈ రెండూ పాయింట్స్ టేబుళ్లో హైదరాబాద్ కన్నా పై స్థాయిలో ఉన్నాయి. ఆ రెండు జట్లనూ ఓడించగలిగితే.. మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న అవకాశంతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ లో బెర్త్ ఖరారు చేసుకోగలదు.
ఒకవేళ హైదరాబాద్ తన రెండు మ్యాచ్ లలో ఒక్కదాంట్లో ఓడిపోయినా.. రాజస్తాన్, పంజాబ్ జట్లకు అది సానుకూలంశం అవుతుంది. వేరే సమీకరణాలతో పని లేకుండా ప్లే ఆఫ్స్ లో స్థానం సంపాదించాలంటే హైదరాబాద్ జట్టుకు విజయాలే మార్గం. బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగాల్సి ఉంది. అది కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ లను ప్రభావితం చేస్తుంది.
పంజాబ్, చెన్నైల మధ్యన ఒక మ్యాచ్ ఉంది. చెన్నై జట్టుకు ఎలాగూ ప్లే ఆఫ్స్ అవకాశాలు లేకపోయినా, పంజాబ్ ను ఓడిస్తే.. దాని అవకాశాలు దెబ్బతింటాయి.
రాజస్తాన్ కు కొంత వరకూ అవకాశాలున్నాయి. కేకేఆర్ తో ఆ జట్టు తన చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. కేకేఆర్ గెలిస్తే రాజస్తాన్ అవకాశాలు దెబ్బతింటాయి.
మొత్తానికి మిగిలింది ఆరు మ్యాచ్ లే అయినా.. ప్లే ఆఫ్స్ కు సంబంధించి మూడు బెర్త్ లను ఇవి డిసైడ్ చేయబోతున్నాయి.