లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన రంగీలా ఊర్మిలకు అనుకోని అవకాశం దక్కుతన్నట్టుగా ఉంది. ఆమెను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తోంది శివసేన.
లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఊర్మిల కాంగ్రెస్ కు దూరం అయ్యింది. పార్టీ అంతర్గత రాజకీయాలే తన ఓటమికి కారణమంటూ ఆమె ఆ పార్టీకి దూరంగా జరిగింది. అనంతరం శివసేనలో చేరింది ఊర్మిల.
ఇటీవలే కంగనా రనౌత్ తీరును తప్పు పట్టి ఊర్మిల వార్తల్లో నిలిచింది. తనను తప్పు పట్టడంతో ఊర్మిలపై విరుచుకుపడింది కంగనా. ఆమెను ఒక సెమీ పోర్న్ స్టార్ అంటూ వ్యాఖ్యానించి కంగనా తన నోటి తీటను తీర్చుకుంది.
తనేదో కాంచనమాల, కన్నాంబ కాలం తరహా నటి అయినట్టుగా కంగనా ఊర్మిలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇన్నేళ్లూ అధికారంలో ఉన్నా లేకపోయినా శివసేనను పల్లెత్తు మాట అనే ధైర్యం బాలీవుడ్ లో ఎవరికీ ఉండేది కాదు.
అలాంటిది కంగనా ఆ పార్టీకి చెవిలో జోరీగలా మారింది. ఈ క్రమంలో బాలీవుడ్ జనాలకు తను కూడా రాజకీయంగా ప్రాధాన్యతను ఇవ్వడం మేలని సేన భావించినట్టుగా ఉంది. అందుకే ఇప్పుడు ఊర్మిలను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తోందట.
ఈ మేరకు శివసేన ప్రతిపాదన రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్సీల జాబితాలో ఊర్మిల పేరును నమోదు చేసినట్టుగా సమాచారం. మొత్తానికి ఎంపీ కాలేకపోయినా ఊర్మిల ఎమ్మెల్సీ అవుతున్నట్టుగా ఉంది.