లోకేష్ ను వైసీపీ మంత్రులు బంతాట ఆడేసుకుంటున్నారు. ఒకరు వేస్ట్ ఫెలో అంటే, మరొకరు పుష్ప మహారాజ్ అంటున్నారు. ఒకరేమో ఒళ్లు తగ్గించుకోవడానికే పర్యటనలంటూ ఎద్దేవా చేస్తే, మరొకరేమో స్టాన్ ఫొర్డ్ (లోకేష్ అక్కడ ఎంబీఏ చదివారట) పరువు తీస్తున్నారంటూ పంచ్ లు వేస్తున్నారు. ఇలా లోకేష్ పై సెటైర్లు వేయని మంత్రి లేడు.
అటు గీతం విద్యాసంస్థల అధినేత భరత్ పై కూడా ఓ రేంజ్ లో విమర్శలు పడుతున్నాయి. గీతం అనేది ఛారిటీ ముసుగు వేసుకున్న కార్పొరేట్ సంస్థ అంటున్నారు కొందరు.
40 ఎకరాలు ఆక్రమించేసి స్టూడెంట్స్ కు ఏం సందేశం ఇస్తారంటూ మరికొందరు ఆడుకుంటున్నారు. కోర్టు స్టే ఇచ్చినా ఆక్రమణల కూల్చివేత తప్పదని వార్నింగులు ఇచ్చేవారు కూడా ఎక్కువయ్యారు. భరత్ కు ఇలా ఒక రేంజ్ లో సెగ తగులుతోంది.
ఇలా పెద్దల్లుడు లోకేష్, చిన్నల్లుడు భరత్ ఒకేసారి పొలిటికల్ గా టార్గెట్ అయ్యారు. విమర్శల్లో తడిసిముద్దవుతున్నారు. ఇలాంటి టైమ్ లో మామ ఏం చేయాలి. వాళ్లకు రక్షణగా బరిలోకి దిగాలి. కానీ బాలయ్య మాత్రం ఎంచక్కా విగ్గు పెట్టుకొని షూటింగ్ కు వెళ్లిపోయారు.
మొన్నటివరకు లాక్ డౌన్ వల్ల కాస్తయినా రాజకీయాలు మాట్లాడిన బాలయ్య.. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వడంతో మరోసారి పాలిటిక్స్ పక్కనపెట్టి సెట్స్ పైకి వెళ్లిపోయారు.
రాజకీయాలు, హిందూపూర్ సంగతి దేవుడెరుగు.. కనీసం అల్లుళ్ల కోసమైనా బాలయ్య రంగంలోకి దిగాలి కదా అని విసుక్కుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఓవైపు లోకేష్-భరత్ నానా తిట్లు తింటుంటే.. బాలయ్య ఏమీ పట్టనట్టు ఉండడం, కనీసం ఓ ప్రకటన కూడా చేయకపోవడం అస్సలు బాగాలేదంటున్నారు.
సమయం వచ్చినప్పుడు కచ్చితంగా బరిలో దిగుతానని, ప్రజాక్షేత్రంలో రణం మొదలుపెడతానంటూ ఈమధ్య ప్రకటనలు గుప్పించారు బాలయ్య. ఆ టైమ్ ఇప్పుడు వచ్చిందంటున్నారు తమ్ముళ్లు. ఇప్పుడు బాలయ్య రంగంలోకి దిగకపోతే, ఇక రాజకీయంగా ఆయనపై విశ్వసనీయత ఉండదని చెబుతున్నారు.
బాలయ్య మాత్రం తనపై వస్తున్న విమర్శల్ని పట్టించుకోవడం లేదు. ఎప్పట్లానే మంచి ముహూర్తం చూసి కొత్త సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. ఆయన మళ్లీ ముఖానికి రంగు తీసి ఇటువైపు రావాలంటే చాలా టైమ్ పడుతుంది.