రాజుగారి విందులో వెయ్యి రూపాయల కిళ్లీ?

రాజుగారు అంటే రాజుగారే. ఆ రేంజ్ అలాగే వుంటుంది మరి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ నెల 11న ఢిల్లీలో ఎంపీలకు భారీ విందు ఇవ్వబోతున్నారు. ఆయన తన వియ్యంకుడు కేవిపి ఇంట్లో…

రాజుగారు అంటే రాజుగారే. ఆ రేంజ్ అలాగే వుంటుంది మరి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ నెల 11న ఢిల్లీలో ఎంపీలకు భారీ విందు ఇవ్వబోతున్నారు. ఆయన తన వియ్యంకుడు కేవిపి ఇంట్లో ఏర్పాటు చేస్తున్న ఈ విందు వైభోగం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

విందులో అయిటమ్ ల సంఖ్యే వందకు పైగా వుంటుందట. అందులో గోదావరి రుచులు సమస్తం వుంటాయట. అటు సంప్రదాయ చికెన్, మటన్, రొయ్యలు, చేపలతో చేసే వంటకాలు, అలాగే స్వీట్లు, హాట్లు, నాటు కోళ్లు, కౌజుపిట్టలు, ఇలాంటి వాటితో చేసే వంటలు, ఇలా ఎన్నో, ఎన్నెన్నో.

ఇందుకోసం కావాల్సిన సామగ్రి, సరంజామా అంతా రెండు ట్రిప్పుల్లో స్పెషల్ ఫ్లయిట్లలో ఢిల్లీకి చేరవేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతిధులకు ఇవ్వడానికి స్పెషల్ గా కిళ్లీలు కట్టిస్తున్నారట. గోదావరి కవటాకులతో చేసిన ఈ కిళ్లీల్లో వాడే కుంకుమపూవు తదితర సుగంథ ద్రవ్యాల ఖరీదే వెయ్యి రూపాయలు వుంటుందని టాక్ వినిపిస్తోంది.

భీమవరం, గోదావరి జిల్లాల వంటకాల ఘుమఘుమలు ఢిల్లీలో ఎంపీలకు కలకాలం గుర్తు వుండిపోయేలా ఏర్పాట్లు సాగుతున్నాయట. భాజపాలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు రఘురామ కృష్ణం రాజు అని టాక్. ఇప్పడు ఈ విందు దానికి పునాది అని ఇంకో టాక్.