రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మార్చి ఆరో తేదీ నుంచినే ఇందుకు సంబంధించి నామినేషన్లను ఆహ్వానిస్తూ ఉంది ఎన్నికల సంఘం. నామినేషన్ల దాఖలుకు తుది గడువు మార్చి 13వ తేదీ. ఆ లోపు పోటీలో ఉండాలనుకునే వాళ్లు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంది.
అయితే ఏపీ అసెంబ్లీ కోటాలో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అసెంబ్లీలో బలాబలాలను బట్టి తెలుగుదేశం పార్టీకి ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కదు. ఈ క్రమంలో ఆ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు అయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవు. నాలుగు సీట్లనూ సొంతం చేసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా తమ అభ్యర్థులు ఎవరో ప్రకటించలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఊహాగానాల విషయానికి వస్తే చాలా మంది పేర్లే జాబితాలో ఉన్నాయి. అయితే వారిలో ఎవరికి జగన్ అవకాశం ఇస్తారో చూడాల్సి ఉంది. కచ్చితంగా రాజ్యసభ సీటు విషయంలో జగన్ నుంచి హామీ పొందిన నేతలు ఎవరూ లేనట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక నేతలంతా ఎమ్మెల్యే హోదాల్లో ఉండటం, ఎన్నికల సమయంలో టికెట్లను త్యాగం చేసిన కొందరికి వేరే హోదాలు లభించడంతో.. రాజ్యసభ విషయంలో జగన్ కు మరీ ఒత్తిళ్లు లేనట్టే.
అయితే రాజకీయ పార్టీ అన్నాకా ఆశావహులు ఉండనే ఉంటారు. కాబట్టి అనేక మంది జగన్ కు తమ విన్నపాలను తెలియజేసుకుని ఉండవచ్చు. ఇక బీజేపీ కోటాలో అంబానీ అనుచరుడు ఒకరికి ఒక సీటు ఇవ్వడానికి జగన్ సానుకూలతనే చూపవచ్చు. రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఆ సీటుతో ఎంతో కొంత ముడిపడి ఉంటాయి కాబట్టి.. సీఎం సానుకూలంగా స్పందించడంలో విడ్డూరం ఏమీ లేదు. ఇక మిగిలిన మూడు సీట్ల విషయంలోనే పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఎలాగూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది కాబట్టి.. మరి కొన్ని గంటల్లోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన రావొచ్చు.