కర్ణాటకలో ఏడాదిగా రాజకీయ సంక్షోభం కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం అక్కడ మనుగడలో ఉందనేమాటే కానీ.. ఎప్పటికప్పుడు గండాలు ఎదురవుతున్నాయి సంకీర్ణ సర్కారుకు. తాము అనుకుంటే కుమారస్వామి సర్కారును కూల్చడం పెద్ద కథేంకాదని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే ఇటీవల మాత్రం తాము ప్రభుత్వాన్ని కూల్చదలుచుకోలేదని కమలనాథులు ప్రకటించారు.
అయితే ఆ తర్వాతే సంక్షోభం తీవ్రతరం అయ్యింది. దాదాపు పద్నాలుగు మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మరింత సంక్షోభంలో పడిపోయింది. ఆ సంగతలా ఉంటే.. ఈ సంక్షోభంలో బీజేపీ ప్రమేయం లేదని, కాంగ్రెస్ –జేడీఎస్ ల మధ్యన సమన్వయం లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందనే వారూ లేకపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు అంశం కూడా ఈ సమస్యకు పరిష్కారం అనే వాదన వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎం రేసులో పలువురి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వారిలో ఒక తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి పేరు కూడా ఉండటం గమనార్హం. ఆయనే రామలింగారెడ్డి. బీటీఎం లేఔట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు రామలింగారెడ్డి. గతంలో ఆయన కీలక పదవులు అధిరోహించారు. సిద్ధరామయ్య సర్కారులో ఆయన హోం మినిస్టర్ గా చేశారు.
అయితే సంకీర్ణ సర్కారులో మాత్రం ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు. దీంతో ఆయన అసహనంతో ఉన్నారు. ఆయన కూతురు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. బీటీఎంకు పక్కనే ఉండే జయనగర నుంచి రామలింగారెడ్డి కూతురు సౌమ్యారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక బెంగళూరు మేయర్ తో సహా రామలింగారెడ్డికి కాంగ్రెస్ లో గట్టి బలం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా సీఎం పదవికే టార్గెట్ పెట్టారనే వార్తలు వస్తున్నాయి.
అయితే తెలుగు మూలాలు ఉన్న వ్యక్తిని అక్కడ ముఖ్యమంత్రి కానిస్తారా అనేది మాత్రం సందేహమే. రామలింగారెడ్డిది వాస్తవానికి బళ్లారి. దశాబ్దాల క్రితమే వారి కుటుంబం బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే సెటిలైంది.