ఇప్పటికే అవినీతిపై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్.. ప్రతి శాఖలో అవినీతిని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. దీంతో పాటు త్వరలోనే ప్రవేశపెట్టబోతున్న పథకాలు, కార్యక్రమాల్లో కూడా అవినీతి లేకుండా చేసేందుకు ఇప్పట్నుంచే కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న గ్రామ సచివాలయం కార్యక్రమంలో భాగంగా.. ప్రతి గ్రామంలో త్వరలోనే గ్రామ వాలంటీర్లను నియమించబోతున్నారు జగన్. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ బృహత్తర పథకాన్ని ఎంచుకున్నారు. అయితే ఈ పథకం ఏమాత్రం పక్కదారి పట్టినా అవినీతి మరింత పెరిగిపోతుంది. ఇది ప్రతిపక్షం చెప్పే మాట కాదు. విశ్లేషకులు, నిపుణులు చెబుతున్న మాట.
ఈ ఆందోళన సీఎం జగన్ లో కూడా ఉంది. అందుకే పారదర్శకంగా గ్రామసచివాలయ కార్యక్రమాన్ని అమలు చేసేలా నిబంధనలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. అంతేకాదు, ఈరోజు జరిగిన కార్యక్రమంలో గట్టిగా హెచ్చరికలు కూడా జారీచేశారు. గ్రామవాలంటీర్లుగా ఎంపికైన వ్యక్తులు ఎవరైనా అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే వాళ్లను ఆ క్షణమే ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని బహిరంగంగా హెచ్చరించారు. ప్రజలకు సహాయ నిరాకరణ చేసిన వాళ్లకు కూడా ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు.
తండ్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన జగన్, ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఆశయాల్ని నెరవేర్చే లక్ష్యంతో కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత కోసం ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని ప్రకటించారు.
నిజానికి అవినీతిని రూపుమాపాలనుకుంటున్న జగన్ ఆలోచన కేవలం గ్రామ సచివాలయాలకు మాత్రమే పరిమితం కాదు. ఇప్పటికే పలు శాఖల్లో దీనికి సంబంధించి కార్యచరణను అమల్లోకి తెచ్చారు ముఖ్యమంత్రి. అటు ప్రాజెక్టుల్లో అవినీతిని తగ్గించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి, రివర్స్ టెండరింగ్ ప్రక్రియను కూడా చేపట్టబోతున్నారు. అవినీతిరహిత పాలన అందించే క్రమంలో ఇలా తన మానసపుత్రిక అయిన గ్రామసచివాలయ పథకంలో కూడా అవినీతి లేకుండా చేయాలనేది జగన్ లక్ష్యం. అందుకే ఇలా బహిరంగంగా హెచ్చరికలు జారీచేయాల్సి వచ్చింది.