సాధారణంగా ఎన్నికలు నెలల దూరంలోకి వచ్చినపుడు రాజకీయంగా ఎత్తులు, పై ఎత్తులు వుంటాయి. కానీ తెలంగాణలో తెరవెనుక ఇప్పటి నుంచే విపరీతంగా ఎత్తులు పై ఎత్తులు చకచకా నడుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎప్పుడయితే సాధారణ ఎన్నికలు జరిగి కేంద్రంలో మోడీ, ఆంధ్రలో జగన్ అధికారం చేపట్టారో అప్పుడే తెలంగాణలో కొన్నిపరిణామాలు చకచకా సంభవించినట్లు తెలుస్తోంది.
ఎప్పుడయితే టీవీ9 వ్యవహారం సంభవించిందో? ఆ ఉత్తరక్షణం నుంచే తెరవెనుక కొన్ని కొత్త ఎత్తుగడలు, కొత్త సమీకరణలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ సమైక్యాంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు అన్ని విధాలా వైభోగంలో వున్న ఓ సామాజిక వర్గ భవిష్యత్ ప్రమాదంలో పడినట్లు భావన ప్రారంభమైంది. అదే టైమ్ లో టీవీ9 రవిప్రకాష్ ఉదంతం కూడా ఆ వర్గాన్ని మరింత ఆలోచనలో పడేసింది.
దీంతో ఆ సామాజిక వర్గ పెద్ద ఒకరు అత్యవసరంగా వ్యూహ రచన చేసి, భాజపాతో తనకు వున్న సంబంధాలు వాడి రవిప్రకాష్ ను కాస్త గట్టెక్కించినట్లు తెలుస్తోంది.ఆ సంగతి అలా వుంచి, తమ వర్గ ప్రయోజనాలు కాపాడితే, ఆ పార్టీని తెలంగాణలో అధికార తీరం దిశగా నడిపించేందుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వ్యూహరచన సాగుతోన్నట్లు బోగట్టా.
తెలంగాణలో తెలుగుదేశం ఎలాగూ కోలుకోదని, అందువల్ల భాజపా ను ఇక్కడ తమ పార్టీగా చేసుకోవాలని, అదే విధంగా ఆంధ్రలో తమ వర్గానికి ప్రస్తుతానికి ఆ పార్టీనే షెల్టర్ జోన్ చేయాలన్నది ఆ వర్గ పెద్ద ప్లాన్ అని, అందుకు అనుగుణంగానే ఇప్పుడు వ్యవహారాలు నడుస్తున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతానికి తెలంగాణ సిఎమ్ కేసిఆర్ విషయంలో మరీ దూకుడుగా వెళ్లకుండా, ఎన్నికల టైమ్ నాటికి పూర్తి స్థాయిలో సిద్దం అయ్యేలా ఓ వర్గం మీడియా ప్లాన్ తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అవసరం అయితే పూర్తిగా యాంటీ కేసిఆర్ ఛానెల్ ఒకటి ప్రారంభించే ఆలోచనలో ఓ కీలక వ్యక్తి రెడీగా వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వున్న న్యాయపరమైన చిక్కులు కాస్త తగ్గగానే ఈ ఛానెల్ పురుడుపోసుకుంటుదని తెలుస్తోంది.
కేసిఆర్ ను కట్టడి చేయడం ద్వారా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకదాంట్లో అయినా తమ వర్గం పట్టు నిలబెట్టుకోవడం, అలాగే జగన్ కు ఓ బలమైన అండను దూరం చేయడం, అదే సమయంలో వీలయితే భాజపా సపోర్టు లేకుండా చేయడం, ఇవన్నీ జరిగితే ఆటోమెటిక్ గా చంద్రబాబుకు అవకాశాలు పెరగడం వంటి బహుముఖ ఆలోచనలు వున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
కేసిఆర్ కు ఏమాత్రం అవకాశం ఇచ్చినా, తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తారని, అందుకే కేవలం తెలంగాణ భాజపాతోనే చెక్ పెట్టాలని, తెలంగాణ భాజపా లో సీమాంధ్ర జనాలు కానీ, ఈ వర్గ జనాలు కూడా ఎంటర్ కాకుండా వుండాలని చూస్తున్నారట. అస్సలు తమ చేయి వున్నట్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, ఆంధ్ర సైడ్ లో తమ వర్గానికి షెల్టర్, తెలంగాణలో భాజపాకు అండ ఇవ్వడం అనే ఉభయ కుశలోపరి అనే స్ట్రాటజీ ప్రస్తుతం చాపకింద నీరులా అమలు జరుగుతోందని బోగట్టా.
ఇది ఎక్కడకు దారి తీసి, ఎక్కడకు చేరుతుందో తెలియాలంటే ఇంకా చాలా టైమ్ పడుతుంది.