తనను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌పై యోగా గురువు రాందేవ్‌బాబాను తీవ్రంగా స్పందించారు. వాళ్ల తండ్రులు దిగొచ్చినా తననె వరూ అరెస్ట్ చేయలేరని ధీమాగా ప్రకటించారు.
అల్లోపతి వైద్యంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాందేవ్‌బాబాపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెయ్యి కోట్లకు పరువు నష్టం దావా వేయడంతో పాటు దేశ ద్రోహం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సీరియస్‌గా రాసిన లేఖపై రాందేవ్ సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ప్రజల ప్రాణాలు కాపాడ్డంలో కీలక సర్జరీలు చేపట్టి మానవాళికి సేవలందించడంతో అల్లోపతి ఎంతో పురోగతి కనబరిచినట్టు తాను నమ్ముతున్నానని రాందేవ్ వివరణ ఇచ్చుకున్నారు.
అలాగే తన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్టు రాందేవ్ ప్రకటించారు. అయినప్పటికీ అల్లోపతి వైద్యులు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఆధునిక వైద్యులు, రాందేవ్ బాబు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అది మరింత తీవ్రమవుతోంది.
రాందేవ్ పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ అరెస్ట్ రామ్ దేవ్ హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు ట్విటర్లో ట్రెండింగ్ చేస్తున్నారు. దీనిపై రాందేవ్ సీరి యస్‌గా స్పందించారు. వారు (నెటిజన్లు) ఏం చేసుకున్నా, వారి తండ్రులు దిగొచ్చినా తననెవరూ అరెస్ట్ చేయలేరని రాందేవ్‌బాబా ఘాటుగా వ్యాఖ్యానించారు. రాందేవ్ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే రాందేవ్‌పై నెటిజన్లు తమదైన రీతిలో కౌంటర్లు ఇస్తున్నారు.