టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు ఇప్పుడు ఇదే ఆలోచనతో వున్నారు. సినిమాల పరిస్థితి పూర్తిగా అనిశ్చితంగా వుంది. అసలు ఏ సినిమా వస్తుందో? ఏ సినిమా రాదో? ఎవరికీ అంతుపట్టడం లేదు. అంతా గాలి లెక్కలే తప్ప, కరోనా వ్యవహారం ఎప్పటికి ముగుస్తుందో? ఎప్పటికి థియేటర్లు తెరుచుకుంటాయో? ఎప్పటికి క్యూ లో వున్న సినిమాలు పూర్తి కావడం, విడుదల కావడం వంటి వ్యవహారాలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు.
షూటింగ్ లు ప్రారంభించాలని వున్నా, అసలు థియేటర్లు ఏమవుతాయో క్లారిటీ లేదు. అన్నీ చిలకజోస్యాలే తప్ప, పక్కా సమాచారం లేదు. ప్రభుత్వాల దృష్టి అంతా కరోనా కట్టడి మీద, వ్యాక్సినేషన్ మీద వుంది తప్ప థియేటర్ల మీద కాదు. పదవ తరగతి పరిక్షలను జూలై వరకు వాయిదా వేసేసారు అంటే పరిస్థితి అర్థం చేసుకోచవ్చు.
కరోనా ఫస్ట్ ఫేజ్ లో తొందరపడి థియేటర్లు తెరిచాం అనే ఆలోచనలో ప్రభుత్వాలు వున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అవే నిజమైతే ఇప్పట్లో థియేటర్ల తలుపులు తెరుచుకోవు. ఆపాటి దానికి ఎందుకు తొందరపడడం. చకచకా షూటింగ్ లు చేసేసినా, రెమ్యూనిరేషన్లు అన్నీ క్లియర్ చేయాలి. పెట్టుబడులు ఫుల్ గా పెట్టేయాలి. విడుదలయ్యే వరకు నెల నెలా వడ్డీలు కట్టుకోవాలి.
అందుకే చాలా మంది నిర్మాతలు కొత్త సినిమాల ఆలోచనలకు కూడా అలా అలా అబేయన్స్ లో పెట్టారు. ప్లాన్ చేస్తే అడ్వాన్స్ లు అడుగుతారు. అవసరమా? ముందు అసలు థియేటర్లు క్లారిటీ వచ్చి, సినిమాల విడుదలలు క్లారిటీ వస్తే, కొత్త సినిమా ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు..ఎప్పటికి విడుదల ఫ్లాన్ చేసుకోవచ్చు అనేవి క్లారిటీ వస్తాయి. అవన్నీ లేకుండా తొందర ఏల అన్నదే చాలా మంది నిర్మాతల ఆలోచనగా వుంది.
పైగా కరోనా థర్డ్ ఫేజ్ అనే భయం వుంది. అది కనుక నిజంగా వచ్చి, సెకెండ్ ఫేజ్ లా అలజడి సృష్టిస్తే, ఇక ఇప్పటికే విడుదల కావాల్సివున్న చాలా సినిమాలను మరచిపోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మేకింగ్ లో వున్న పెద్ద సినిమాలు కూడా ఫస్ట్ లుక్ లు, ఇతరత్రా వ్యవహారాల మీద అంత సీరియస్ గా లేవు. ఎందుకంటే ఎప్పుడు విడుదలవుతుందో అన్నది కాస్త క్లారిటీ వుంటే, వెల్ ప్లాన్డ్ గా కంటెంట్ వదులుకోవచ్చు. అదేమీ లేకుండా ఎందుకు హడావుడి?