ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ తుదిశ్వాస విడిచారు. 96 యేళ్ల వయసులో గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న న్యాయవాది ఆదివారం ఉదయం స్వగృహంలో మరణించారు. దేశంలో అత్యంత పేరున్న లాయర్లలో ఒకరు జెఠ్మలానీ. వాజ్ పేయ్ ప్రభుత్వం లో న్యాయశాఖమంత్రిగా కూడా పని చేశారు. నడవడం కూడా కష్టం అనుకునే వయసులో కూడా అనేక కేసుల్లో వాదనలు వినిపిస్తూ వచ్చారు.
దేశంలో అత్యంత సంచలనం సృష్టించిన కేసుల్లో జెఠ్మలానీ నిందితుల తరఫున వాదించారు. హర్షద్ మెమతా స్కామ్ లో, రాజీవ్ హత్య కేసు, ముంబై పేలుళ్ల వ్యవహారాలు.. వంటి కేసుల్లో న్యాయవాదిగా జెఠ్మలానీ పేరు మార్మోగింది. దావూద్ ఇబ్రహీం కూడా తను లొంగిపోతానంటూ జెఠ్మలానీనే సంప్రదించారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని జెఠ్మలానీ కూడా ప్రకటించుకున్నారు.
జెఠ్మలానీ మరణం పట్ల ప్రముఖులు స్పందించారు. నివాళి ఘటించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్వయంగా వెళ్లి జెఠ్మలానీ భౌతిక కాయానికి నివాళి ఘటించారు.